ఢిల్లీ ఎన్నికల్లో యమునా నది నీటిపై ఆప్- బీజేపీ పోరు!

ఢిల్లీ ఎన్నికల్లో యమునా నది నీటిపై ఆప్- బీజేపీ పోరు!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్‌ఆద్మీ పార్టీకి ఈసారి గెలిచే అవకాశం ఇవ్వకూడదని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంలో దూకుడు పెంచారు. కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈసారి తమదే విజయమని ఢంకా కొట్టినట్టు చెబుతున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేసి నడ్డా తదితరులు ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు.  

ఈ తరుణంలో యమునా నదిపై రగడ ఆమ్‌ఆద్మీ, బీజేపీ పార్టీల మధ్య వార్‌గా ప్రకంపనలు సృష్టిస్తోంది. యమునా నది కాలుష్యం కావడానికి హర్యానా ప్రభుత్వమే కారణమని కేజ్రీవాల్ ఆరోపించడం పెద్ద రాజకీయ దుమారంగా మారింది. తాను బతికి ఉన్నంతవరకు యమునా నది నీటిని ఢిల్లీ ప్రజలు తాగకుండా చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. 

దీనిపై హర్యానా ప్రభుత్వంతోపాటు కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇది రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడమౌతుందని, ఢిల్లీ జల్‌బోర్డు ఉద్యోగులు విషాన్ని ఎలా గుర్తిస్తున్నారో చెప్పాలని ఎన్నికల కమిషనర్ కోరారు. ఈమేరకు కేజ్రీవాల్‌కు నోటీసులు పంపారు. యమునా నదిలో అమెనియా కలియడం వల్ల విషపూరితం కాకుండా నివారించవలసిన బాధ్యత ఢిల్లీ ఆప్ ప్రభుత్వానిదేనని ఎన్నికల కమిషనర్ గుర్తు చేశారు.

మరోవైపు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ యమునా నదిని తాగడం వైరల్ అయింది. ఆయన నీటిని తాగినట్టు నటించారే తప్ప అసలు తాగలేదని, నోట్లోని నీటిని వెంటనే ఉమ్మేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. హర్యానా సిఎం నయాబ్‌సింగ్ సైనీ యమునా నీటిని తాగి ఊసేసిన వీడియో క్లిప్‌ను కేజ్రీవాల్ పోస్టు చేశారు.

అమెనియో కాలుష్యం కారణంగా యమునా నీరు ఢిల్లీ ప్రజలకు ప్రాణాంతకంగా మారిందన్నతనపై కేసు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.  2019 లో ముంబైలో పైపుల ద్వారా సరఫరా అయ్యే నీళ్లు నూటికి నూరు పాళ్లు సురక్షితం అని పాలకవర్గాలు ప్రకటించాయి. కానీ అంతకు ముందు వానాకాలం వచ్చే సరికి ముంబై నగరమంతా నీటి సంబంధిత వ్యాధులతో జనం అల్లాడిపోయారు. 

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గత అసెంబ్లీ ఎన్నికల ముందు మంచినీటి సమస్యను పరిష్కరించడమే తమ ప్రాధాన్యంగా ఓటర్లకు హామీ ఇచ్చారు. తాగునీటి సరఫరా తలసరి వాటా 9 లక్షల లీటర్ల నుంచి 10 లక్షల లీటర్ల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. వాడుక నీటిని రీసైకిల్ చేసి మళ్లీ వినియోగించేలా చేస్తామన్నారు. కానీ చెన్నై సబర్బన్ ప్రాంతం పల్లవరంలో తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసి అక్కడి మంచినీటి వ్యవస్థ దెబ్బతింది.

పైపుల ద్వారా వచ్చే కలుషిత నీరు తాగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 34 మంది ఆస్పత్రి పాలయ్యారు.ఈ సంఘటనలను పరిశీలిస్తే మంచినీటి సమస్యను ఎన్నికల సమయంలో ప్రచార ఆయుధంగా మారుతున్నట్లు స్పష్టమవుతుంది. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న యమునా నది రగడ కూడా అంతే. 

ఎన్నికలు వచ్చేవరకు యమునా నది సమస్య ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తెలీదా? వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కేజ్రీవాల్ యమునా నదిని ప్రక్షాళనం చేస్తామని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఆ తరువాత ఈ సమస్యను విస్మరించారు. ఢిల్లీ ఒక్కటే కాదు. దేశం మొత్తం మీద పైపుల ద్వారా వచ్చే నీళ్లు ఎందుకు తాగడానికి పనికి రావడం లేదు? 

ఎన్‌ఎస్‌ఎస్‌ఒ డేటా ప్రకారం దేశంలో దాదాపు 95 శాతం కుటుంబాలు తాగునీటి సరఫరాకు అనుసంధానంగా ఉంటున్నాయి. పైపుల నీళ్లు, గొట్టపుబావులు, రక్షితబావులు, ప్యాకేజీ నీళ్లు, ఈ విధంగా అందుతున్నాయి. అయితే ఈ విధంగా సరఫరా అవుతున్న నీళ్లన్నీ సురక్షితం అని ఎవరూ నమ్మకంగా చెప్పలేక పోతున్నారు.

నీటి సరఫరా చెప్పుకోతగినంతగా మెరుగుపడినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా సరఫరాలో లోటు కనిపిస్తుంది. 2023లో గ్రామీణ కుటుంబాల్లో కేవలం 40 శాతం మాత్రమే తమ ప్రధాన నీటి వనరుగా పైపు నీళ్లను వాడుకున్నారు. అదే విధంగా అర్బన్ కుటుంబాలు 70 శాతం పైపు నీళ్లను వినియోగించారు. మొత్తం మీద నీటిసరఫరా మెరుగుపడినప్పటికీ, నీటి నాణ్యత అన్నది పెద్ద సమస్యగా ఉంటుంది.

ప్రపంచ స్థాయి నీటి నాణ్యత సూచికలో మొత్తం 122 దేశాల్లో భారత్ 120 వ స్థానంలో ఉందని నీతి ఆయోగ్ 2018 లో వెలువరించిన తన ‘ కాంపోజిట్ వాటర్ మేనేజిమెంట్ ఇండెక్స్’ లో వెల్లడించింది. దాదాపు 70 శాతం నీళ్లు కాలుష్యం పూరితంగా ప్రకటించింది. ప్రతిరోజూ నదులు, ఇతర నీటివనరుల్లో 40 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాలు కలుస్తున్నాయని అంచనా. 

చాలా స్వల్ప స్థాయిలోనే నీటి ప్రక్షాళన జరుగుతోంది. ఆ నీరు కూడా పైపుల ద్వారా ప్రవహించి చివరకు కలుషితమవుతున్నాయి. దీనికి కారణం పాత పైపులు, మురికి నీరు పారే సూయెజ్ లైన్ల అనుసరించి ఈ పైపు నీళ్లు పారుతుండడం కలుషితం కావడానికి దారి తీస్తున్నాయి. ప్రతిరోజూ కొన్ని గంటల వరకే పైపుల ద్వారా నీరు సరఫరా అవుతుండగా, పైపులు లీకై చాలావరకు నీళ్లు మట్టిలో కలిసిపోతుండటం పరిపాటిగా జరుగుతోంది.

చాలావరకు పైపుల ద్వారా వచ్చే నీళ్లు వినియోగానికి పనికి రానివిగా ఉంటున్నాయి. ప్రాంతాల బట్టి నీటి నాణ్యత మారిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 1.7 బిలియన్ మంది మలమూత్రాల మయమైన నీటినే తాగునీటిగా వినియోగిస్తున్నారని 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.ఈ కారణంగానే డయేరియా వంటి వ్యాధులు ప్రబలి ప్రపంచం మొత్తం మీద ఏటా మిలియన్ మంది ప్రాణాలు కోల్పోతున్నారు.