
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. రైతు భరోసా పథకం కొనసాగుతున్న పథకమే అయినందున ఎన్నికల సంఘం నుండి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవి అయినందును ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలు కూడా లేవని తెలిపారు.
అవసరమైతే బీజేపీ పక్షాన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ పంపిందుకు కూడా సిద్ధమని ఆయన తెలిపారు. తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి రైతు భరోసా సహా ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇండ్ల నిర్మాణ లబ్దిదారులను వెంటనే ఎంపిక చేసి మంజూరు చేయాలని ఆయన కోరారు. ఒకవేళ ఎన్నికల సంఘం కోడ్ సాకుతో ఆయా పథకాలను నిలిపివేయాలని చూస్తే తాము ఊరుకోబోమని బండి హెచ్చరించారు.
ఒకవేళ ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తే అఖిలపక్షంతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా పైసలు జమ చేసేందుకు అనుమతి తీసుకుందామని సంజయ్ తెలిపారు. ఇప్పటికే ఏడాది పాటు రైతు భరోసా నిధులు అందక రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఈ నెలలోనైనా ప్రస్తుతం గిట్టుబాటు ధర రాక, పంట పెట్టుబడులు పెరిగి రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ తరుణంలో చేతికందే సొమ్మును కూడా ఆపేస్తే రైతు నోట్లో మట్టికొట్టినట్లే అవుతుందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని, వీరిలో 40 వేల మందికి మాత్రమే మంజూరు చేసి మిగిలిన 99 శాతం మంది పేదల కడుపు కొట్టడం అమానవీయమని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే వ్యవసాయ భూమిలేని 10 లక్షల మంది కూలీల కుటుంబాలకు వారి బ్యాంకు ఖాతాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం కేవలం 20,336 మంది ఖాతాల్లోనే డబ్బులు జమ చేసి, మిగిలిన 9,79,000 మందికిపైగా కూలీలకు జమ చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల కోసం అందిన 70 లక్షలకు పైగా దరఖాస్తుల్లో దాదాపు 40 లక్షల మంది పేదలు ఇండ్లకు అర్హులని తేలితే ఇప్పటి వరకు 72 వేల 406 మందికి మాత్రమే ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసి, మిగిలిన వారిని ఎంపిక చేయకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
More Stories
హైదరాబాద్ నుండి మరో రెండు వందే భారత్ రైళ్లు
డ్రగ్స్ రహిత సమాజం కోసం బిజెపి 3కె రన్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం