భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలుపుతాం

భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలుపుతాం
ప్రపంచంలోనే భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలపనున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. భారత సామాజిక చేతనకు మహాకుంభమేళా నిదర్శనంగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు.
 
తొలుత ఆమె ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ సేవలను కొనియాడారు. అలాగే, మహాకుంభమేళా తొక్కిసలాటలో మృతి చెందిన భక్తులకు నివాళులర్పించారు.  దేశాభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వ మూడో టర్మ్‌లో మూడు రెట్ల వేగంతో అభివృద్ధి సాగుతోందని రాష్ట్రపతి తెలిపారు.

‘బడ్జెట్‌-2025లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. రూ.70 వేల కోట్లతో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. 3 కోట్ల మంది పేద కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నాం. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే మా లక్ష్యం’ అని రాష్ట్రపతి వివరించారు.  “దేశ అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు లబ్ధి చేకూర్చుతున్నాయి. 70 ఏళ్ల దాటిన 6 కోట్ల మందికి ఆరోగ్య భీమా, లక్‌పతి దీదీ పథకం ద్వారా 3 లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేయాలనేదే ప్రభుత్వం లక్ష్యం. డ్రోన్ దీదీ స్కీమ్ మహిళలకు ఉపయోగపడుతోంది” అని రాష్ట్రపతి చెప్పుకొచ్చారు.

 
“పేద, మధ్యతరగతి ప్రజలకు హోమ్‌ లోన్‌ సబ్సిడీ ఇస్తున్నాం. ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘాన్ని నియమించాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. వన్‌ నేషన్‌ – వన్ ఎలక్షన్‌ దిశగా అడుగులు వేస్తున్నాం. ట్యాక్స్‌ విధానాలను సరళీకరించాం. భారత్‌ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది” అని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. 
 
“చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లతో గొప్ప ముందడుగు వేస్తున్నాం. 70 ఏళ్లు దాటిన 6 కోట్లమందికి ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం. యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం. దేశంలో లక్షా 15 వేల మంది మహిళలు లక్‌పతీ దీదీలుగా మారారు. మూడు లక్షలమంది మహిళలను లక్‌పతీ దీదీగా మార్చాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం”అని రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో వివరించారు.
 
‘డిజిటల్ టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం భారత్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. యూపీఐ లావాదేవీల విధానం చూసి అభివృద్ధి చెందిన దేశాలే ముక్కున వేలేసుకుంటున్నాయి.. సామాజిక న్యాయం, సమానత్వానికి మా ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీని ఓ సాధనంగా వినియోగిస్తోంది’ అని ఆమె తెలిపారు.
 
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా కృషి చేస్తోందని చెబుతూ ఈ ప్రాజెక్ట్ కోసం రూ.12 వేల కోట్లు కేటాయించామని రాష్ట్రపతి తెలిపారు.  వక్ఫ్ బోర్డు సంస్కరణపై దృష్టి సారించిందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షలాది మంది పేదల సొంతింటి కల నెరవేరబోతోందని పేర్కొన్నారు. 
 
భారతీయుడు అంతరిక్షంలో అడుగుపెట్టే రోజు ఎంతో దూరంలో లేదని చెబుతూ ‘ఇటీవలే ఇస్రో 100 వ ప్రయోగం విజయవంతంగా నిర్వహించింది.. అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి’ అని తెలిపారు.  నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. భారత్‌ను ఇన్నోవేషన్ పవర్ హబ్‌గా మార్చాలన్నదే లక్ష్యం. ఇటీవలనే ఇండియా ఏఐ మిషన్ ప్రారంభించామని వివరించారు.  “ఖేలో ఇండియా దేశంలో యువతకు ఎంతో ఉపయోగపడుతోంది.. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు’ అని రాష్ట్రపతి తెలిపారు.