
మాజీ మంత్రి, సీనియర్ వైసిపి నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడవిలో ఏర్పాటు చేసుకున్న అక్రమ సామ్రాజ్యం ఆరోపణలపై తగు చర్యలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఏకంగా 75.75 ఎకరాలు భూమిని ఆక్రమించారన్న ఆరోపణలపై నిగ్గు తేల్చాలని పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్జెర్వేటర్ ఆఫ్ ఫారెస్టు అధికారులతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది.
చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై వచ్చిన కథనాలను తెలుసుకున్న సీఎం చంద్రబాబు అధికారులను తక్షణ నివేదిక కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినవెంటనే పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం, మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిథిలో భూ అక్రమాలపై అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. దీంతో సంతృప్తి చెందని సీఎం సమగ్ర నివేదిక కోరినట్లు తెలిసింది.
75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేరడంపై అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదికపై ఉండవల్లిలోని తన నివాసంలోనే అధ్యయనం చేసిన సీఎం చంద్రబాబు సచివాలయంలో జరిగే రెవెన్యూ శాఖ సమీక్షలో దీనిపై చర్చించాలని నిర్ణయించారు. అటవీ భూములు ఆక్రమణ వ్యవహారాన్ని సంబంధిత శాఖలు సీరియస్గా తీసుకునేలా స్పష్టమైన ఆదేశాలు క్షేత్రస్థాయికి సీఎంవో నుంచి వెళ్లాయి. పుంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలంలో రికార్డుల తారుమారుతో, బినామీ పేర్లతో వందల ఎకరాల ఆక్రమణ ఆరోపణలు ఉన్నట్లు సీఎం దృష్టికి వచ్చింది.
వెంటనే పూర్తి స్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించటంతో ప్రభుత్వం జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది. చిత్తూరు కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మనికంఠ చందోలు, ఐఎఫ్ఎస్ అధికారి యశోద బాయ్లను జాయింట్ కమిటీలో సభ్యులుగా నియమించారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. పక్కా అధారాల సేకరణతో కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు సమాచారం.
అటవీశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కల్యాణ్ కూడా పెద్దిరెడ్డి కుటుంబ భూ అరాచకాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. పీసీసీఎఫ్తో మాట్లాడుతూ అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు