లావోస్‌లో 67 మంది భారతీయులకు విముక్తి

లావోస్‌లో  67 మంది భారతీయులకు విముక్తి
లావోస్‌లో సైబర్‌ స్కామ్‌ ముఠా చేతిలో చిక్కుకున్న 67 మంది భారతీయలను అక్కడి భారత రాయబార కార్యాలయం రక్షించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. లావోస్‌లోని బోకియో ప్రావిన్స్‌లోని గోల్డెన్‌ ట్రయాంగిల్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (జిటిఎస్‌ఇజెడ్‌)లో సైబర్‌ స్కామ్‌లకు పాల్పడే ఒక ముఠా  వీరిని బలవంతంగా బెదిరించి పనిచేయిస్తున్నారని ఇండియన్ మిషన్ పత్రికా ప్రకటనలో వెల్లడించింది.
 
వీరు సహాయం కోసం భారత రాయబార కార్యాలయాన్ని అభ్యర్థించారు. దీనికి స్పందించిన కార్యాలయం అధికారుల బృందాన్ని జిటిఎస్‌ఇజెడ్‌కు పంపింది. భారతీయుల విడుదల కోసం లావోస్‌ అధికారులతోనూ సమన్వయం చేసుకుంది. అవసరమైన విధానాలు, డాక్యుమెంట్లు అందజేసింది. తరువాత వారిని బోకియో ప్రావిన్స్‌లో నుంచి రాజధాని వియంటియాన్‌కు తరలించింది.
 
అక్కడ వారికి వసతి, ఆహారంతోపాటు అవసరమైన ఇతర సహాయాలను కల్పించింది. వీరిని సురక్షితంగా భారత్‌కు తరలిస్తామని లావోస్‌లోని భారత రాయబారి ప్రశాంత్‌ అగర్వాల్‌ హామీ ఇచ్చారు. వారికి ఎలాంటి కష్టనష్టాలు ఎదురుకావని భరోసా ఇచ్చారు. తదుపరి చర్యలపై వారికి సూచనలు చేశారు. భారతీయుల్ని రక్షించడంలో సహాయం చేసిన లావోస్‌ అధికారులకు రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. 
 
జిటిఎస్‌ఇజెడ్‌లోని క్రిమినల్‌ సిండికేట్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. విదేశీ ఉద్యోగ అవకాశాలపై జాగ్రత్తగా ఉండాలని భారత యువతను కార్యాలయం హెచ్చరించింది. ఇప్పటి వరకూ 924 మంది భారతీయుల్ని లావోస్‌లోని రాయబార కార్యాలయం రక్షించింది. వీరిలో 857 మందిని సురక్షితంగా భారత్‌కు తిరిగి పంపించింది.