మహాకుంభమేళాతో అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు

మహాకుంభమేళాతో అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా కొనసాగుతోంది. గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. మహాకుంభమేళా వేళ యూపీలోని ప్రఖ్యాత ప్రదేశం అయోధ్యకు కూడా భక్తులు పోటెత్తుతున్నారు. అయోధ్య రామ మందిరాన్ని  సందర్శిస్తున్నారు.

ముఖ్యంగా జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున అయోధ్యలోని రామ మందిరాన్ని 25 లక్షల మందికిపైగా భక్తులు సందర్శించినట్లు ఆలయ ట్రస్ట్‌ తెలిపింది. భక్తులు రామ్‌ లల్లాతోపాటు హనుమాన్‌గర్హి ఆలయాన్ని సందర్శిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వస్తున్న భక్తులు అటునుంచి అయోధ్యకు వస్తున్నట్లు తెలిపింది. 

కాగా, భక్తుల రాకతో అయోధ్యా నగరి రద్దీగా మారింది. మరోవైపు రానున్న రోజుల్లో అయోధ్యకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రద్దీ దృష్ట్యా రామ మందిరం, హనుమాన్‌ గర్హి ఆలయాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించింది.

త్రివేణి సంగ‌మంలో ప‌విత్ర స్నానాలు ఆచ‌రించేందుకు కోట్ల సంఖ్యలో భ‌క్తులు ప్రయాగ్‌రాజ్‌కు త‌ర‌లివ‌స్తున్నారు. ఇప్పటికే 15 కోట్ల మంది మ‌హాకుంభ్‌లో అమృత‌ స్నానాలు చేశారు. అయితే రేపు మౌనీ అమావాస్య సంద‌ర్భంగా  కుంభ‌మేళాకు ఒక్క రోజే సుమారు ప‌ది కోట్ల మందికిపైగా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నట్లు అంచ‌నా వేస్తున్నారు. దీని కోసం యూపీ స‌ర్కారు భారీగా ఏర్పాట్లు చేస్తున్నది. 

గ‌డిచిన 17 రోజుల్లో ప్రతి రోజూ సుమారు కోటి మంది వ‌ర‌కు పుణ్య స్నానాలు ఆచ‌రిస్తున్నారు. బుధ‌వారం మౌనీ అమావాస్య కోసం భారీ ఏర్పాట్లు చేసిన‌ట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఏఐ ఆధారిత సీసీ కెమెరాల‌ను అమ‌ర్చారు. ఇప్ప‌టికే ప్ర‌యాగ్‌రాజ్‌ను నో వెహికిల్ జోన్‌గా ప్ర‌క‌టించారు. సంగంకు వెళ్లే స్థానికులు ఫోర్ వీల‌ర్ల‌ను కాకుండా, టూ వీల‌ర్ల‌ను వాడాల‌ని ప్ర‌భుత్వం సూచించింది.

మౌనీ అమావాస్య రోజున న‌దీ స్నానం విశేష‌మైంది. మ‌హాకుంభ‌మేళాలో అమావాస్య రోజున నిర్వ‌హించే స్నానాన్ని అత్యంత ప‌విత్రంగా భావిస్తారు. ఈ నేప‌థ్యంలో రేపు ఉద‌యం 6.45 నిమిషాల‌కు .. త్రివేణి సంగమంలో స్నానం ఆచ‌రించే భ‌క్తుల‌పై పూల‌వ‌ర్షం కురిపించేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. షాహి స్నానం నిర్వ‌హించే తేదీల్లో.. నాగ సాధువులు, అకాడాలు భారీ ర్యాలీగా న‌దీ తీరానికి చేరుకుంటారు. 
 
అమృత స్నాన దినాల్లో అదే ఆక‌ర్ష‌ణీయ‌మైంది. అయితే సూర్యుడు, చంద్రుడు, బృహ‌స్ప‌తి.. ఒకే రేఖ‌లోకి రావ‌డం వ‌ల్ల‌.. ప‌విత్ర న‌దుల ఆధ్యాత్మిక శ‌క్తి మ‌రింత దిగ్విణీకృతం అవుతుంద‌ని భావిస్తారు. జ‌న‌వ‌రి 28, 29, 30 తేదీల్లో ప్ర‌యాగ్‌రాజ్‌లో స్కూళ్ల‌కు సెలవు ప్ర‌క‌టించారు.