వక్ఫ్‌ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం

వక్ఫ్‌ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం
* 14 సవరణలకు కమిటీ ఆమోదం
 
వక్ఫ్‌ బోర్డ్‌ అధికారాలకు కోత పెడుతూ మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన ‘వక్ఫ్‌ సవరణ బిల్లు’కు ఆమోదం లభించింది. ఈ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ సోమవారం సమావేశమైన పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది. అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సభ్యులు ప్రతిపాదించిన మొత్తం 14 సవరణలను జేపీసీ ఆమోదించింది. విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరణకు గురయ్యాయి.

కాగా, వక్ఫ్‌ సవరణ బిల్లుకు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్‌కు బీజేపీ ఎంపీ జగదాంబి పాల్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన సమక్షంలో జేపీసీ కమిటీ ఇవాళ సమావేశమైంది. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా,14 సవరణలను కమిటీ ఆమోదించినట్లు ప్యానెల్‌ ఛైర్మన్‌ జగదాంబిక పాల్‌ వెల్లడించారు. 

ఈ సవరణలు చట్టాన్ని మరింత శక్తివంతంగా మారుస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  పేదలు, పస్మాండ ముస్లింలకు ప్రయోజనాలు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. కమిటీ ప్రతిపాదించిన ముఖ్యమైన సవరణలలో ఒకటి, ప్రస్తుత వక్ఫ్ ఆస్తులను ‘వినియోగదారుడి ద్వారా వక్ఫ్’ ఆధారంగా ప్రశ్నించలేమని ప్రస్తుత చట్టంలో ఉంది, కానీ ఆస్తులను మతపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంటే కొత్త వెర్షన్‌లో తొలగించబడుతుంది.

“క్లాజుల వారీగా చర్చించడానికి ఒక సమావేశం జరిగింది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అన్ని సవరణలను – వాటిలో ప్రతి 44 సవరణలను నేను వారి పేర్లతో చదివాను. వారు తమ సవరణలను ప్రతిపాదిస్తున్నారా? అని నేను వారిని అడిగాను. అప్పుడు వాటిని ప్రతిపాదించారు. ఇది ఇంతకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేది కాదు” అంటూ తమ కమిటీ నిస్పక్షపాతంగా వ్యవహరించినట్లు చెప్పుకొచ్చారు.
 
“సవరణలను ప్రతిపాదించి, వాటికి వ్యతిరేకంగా 16 మంది సభ్యులు ఓటు వేసి, వాటికి అనుకూలంగా 10 మంది మాత్రమే ఉంటే, వారికి మద్దతు ఇచ్చే 10 మంది సభ్యులు ఉన్న వాటిని ఆమోదించవచ్చా? అది పార్లమెంటు అయినా లేదా జెపిసి అయినా, అది సహజం,” అని పాల్ స్పష్టం చేశారు.
 
ప్రతిపక్షాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అనేకం ఆమోదం పొందాయని కూడా అయన ఈ సందర్భంగా తెలిపారు. “ఈ రోజు, ఒక సవరణ ఆమోదించబడింది – గతంలో కలెక్టర్‌ను అధికారిగా ఉండేవారు. కానీ ఇప్పుడు అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. అది కమిషనర్ లేదా కార్యదర్శి కావచ్చు,” అని పాల్ పేర్కొన్నారు.

కమిటీలో ఎన్డీయే సభ్యులు సూచించిన మార్పులకు ఆమోదం లభించగా, విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరణకు గురయ్యాయి. ఫలితంగా ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కమిటీ పనిచేయలేదని విపక్ష సభ్యులు ఆరోపించారు.  కాగా, ఈ 14 ప్రతిపాదనల ఆమోదానికి సంబంధించి జనవరి 29న ఓటింగ్‌ జరగనుంది. జనవరి 31న తుది నివేదిక లోక్‌సభకు అందజేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

కాగా, ఈనెల 24న జరిగిన వక్ఫ్‌ ప్యానల్‌ సమావేశం రసాభాసగా సాగిన విషయం తెలిసిందే. జేపీసీ చైర్మన్‌ జగదంబికా పాల్‌ ప్రొసీడింగ్స్‌ ద్వారా తమపై ఒత్తిడి తీసుకువస్తూ ఇష్టారీతిగా అజెండాను మార్చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలియజేయడంతో సమావేశానికి హాజరైన 10 మంది ప్రతిపక్ష సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్‌ చేస్తున్నట్టు చైర్మన్‌ ప్రకటించారు. 

ప్రొసీడింగ్స్‌ని ఓ ప్రహసనంగా మార్చేసిన చైర్మన్‌ జగదంబికా పాల్‌ ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష సభ్యులు జేపీసీ సమావేశంలో ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండించిన చైర్మన్‌ సమావేశాన్ని అడ్డుకోవడానికే సభ్యులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.