ఖోఖో తొలి ప్రపంచకప్‌లో భారత్ విజయభేరి

ఖోఖో తొలి ప్రపంచకప్‌లో భారత్ విజయభేరి
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ పోటీలలో పురుషుల, మహిళల విభాగాల్లో భారత్ విజయభేరి మోగించి, సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌ని అటు మహిళల, ఇటు పురుషుల విభాగంలో కప్‌ని సొంతం చేసుకోవడం మాములు విషయం కాదంటూ  పలువురు ప్రముఖులు రెండు జట్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
 
ఆదివారం జరిగిన మహిళల ఫైనల్లో భారత్‌ 78-40 పాయింట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసి విజేతగా ఆవిర్భవించింది. ఇక..పురుషుల జట్టు 54-36 పాయింట్ల తేడాతో నేపాల్‌ను ఓడించి చాంపియన్‌షి్‌ప దక్కించుకుంది. తొలుత జరిగిన అమ్మాయిల ఫైనల్లో మనోళ్లు అన్ని రంగాలలో తిరుగులేని ప్రదర్శన కనబరచారు. అనూహ్యమైన వేగంతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేశారు. భారత్‌ ధాటికి నేపాల్‌ చేష్టలుడిగింది. మొదటి టర్న్‌ ఆరంభంనుంచే భారత అటాకర్ు విజంభించారు.

తొలి టర్న్‌లోనే 34 పాయింట్లతో భారత్‌ తిరుగులేని స్థితిలో నిలిచింది. రెండో టర్న్‌లో నేపాల్‌ 35-24కి ఆధిక్యాన్ని తగ్గించింది. కానీ మూడో టర్న్‌లో దుమ్ము రేపిన భారత మహిళలు ఇంకో 38 పాయింట్లను ఖాతాలో వేసుకున్నారు. నాలుగో టర్న్‌ ఆరంభానికి 49 పాయింట్ల ఆధిక్యంలో నిలిచిన భారత్‌ను అడ్డుకోవడం నేపాల్‌ వల్ల కాకపోయింది. ఈ టర్న్‌లో ఆ జట్టు కేవలం 16 పాయింట్లే చేయగలిగింది.

నేపాల్‌తో తుది పోరులో పురుషుల జట్టు కూడా అన్ని రంగాలలో కదం తొక్కింది. దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్లో తేలిపోయిన డిఫెన్స్‌ విభాగం..నేపాల్‌పై చెలరేగింది. తొలి టర్న్‌.. అటాకింగ్‌లో 26 పాయింట్లను భారత్‌ సాధించింది. రెండో టర్న్‌లో నేపాల్‌ 18 పాయింట్లు రాబట్టింది.  దాంతో రెండు టర్న్‌లు ముగిసే సరికి భారత్‌ 26-18తో ముందంజలో నిలిచింది. మూడో టర్న్‌..అటాకింగ్‌లో భారత పురుషులు మరింత దూకుడుతో ఇంకో 28 పాయింట్లు సొంతం చేసుకున్నారు. ఇక..చివరి టర్న్‌లో నేపాల్‌ 18 పాయింట్లే చేయడంతో భారత్‌ విజయం ఖాయమైంది.

సోషల్ మీడియా వేదికగా ఎస్. ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి వారు.. రెండు టీమ్‌లను అభినందిస్తూ.. టీమ్ సభ్యులపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత ప్రాచీన క్రీడ అయిన ఖోఖో మొట్టమొదటి ప్రపంచకప్‌ని భారత్ సొంతం చేసుకోవడం గర్వించాల్సిన విషయమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తుండటం విశేషం.
 
ఇక ఈ గెలుపుపై దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి స్పందిస్తూ ‘‘భారతదేశానికి చెందిన ప్రాచీన క్రీడ ఖోఖో‌కి సంబంధించి తొలి ప్రపంచకప్‌ జరిగింది. ఈ క్రీడా సంబరాలను ప్రపంచం అంతా నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ తొలి ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో మహిళ, పురుషుల జట్లు టైటిల్స్ గెలిచి భారతదేశం గర్వించేలా చేసినందుకు.. ఇరు జట్లకు అభినందనలు. జైహింద్’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
దర్శకధీరుడు రాజమౌళితో తదుపరి సినిమా చేయబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు  ‘‘భారత మహిళా మరియు పురుషుల జట్లు తొలి #KhoKhoWorldCupను గెలవడమే కాకుండా భారతదేశపు పురాతన ఈ క్రీడకు మళ్ల రాణం పోశారు. దేశం మొత్తం గర్వపడే క్షణమిది’’ అని క్లాప్స్ ఈమోజీలతో తన ఆనందాన్ని తెలియజేశారు. 
 
ఇంకా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఇరు జట్లకు అభినందనలు తెలిపారు. కాగా, టీమ్ ఇండియాకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.