ఇజ్రాయిల్- హమాస్ చర్చల్లో పురోగతి!

ఇజ్రాయిల్- హమాస్ చర్చల్లో పురోగతి!
ఇజ్రాయిల్- హమాస్ ల మధ్య కాల్పుల విరమణ చర్చల్లో పురోగతి సాధించాయని, రేపోమాపో ముసాయిదా ఒప్పంద ప్రతులను ఇరు పక్షాలు మార్పిడి చేసుకోనున్నాయని పేరు తెలపడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపినట్లు అసొసియేటెడ్‌ ప్రెస్‌ వార్తా సంస్థ పేర్కొంది. బందీల విడుదల, కాల్పుల విరమణకు సంబంధించి మధ్యవర్తిత్వం వహించిన అరబ్‌, అమెరికా ప్రతినిధులను ఉటంకిస్తూ అధికారులు ఈ విషయం తెలిపారు. 
 
అయితే దీనిపై ఇరు పక్షాలు ఒక ఒప్పందానికి రావడానికి ఇంకా కొన్ని అవరోధాలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తే ఒప్పందానికి మార్గం సుగమం అవుతుందని హమాస్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. గతంలో కూడా అమెరికా అధికారులు ఒప్పందం దాదాపు ఖరారైపోయిందన్నట్టుగా ఇలాగే ప్రకటనలిచ్చారు. కానీ, అవేవీ వాస్తవ రూపం దాల్చలేదు. ఇది కూడా అటువంటి ప్రచారమేనా అన్న అనుమానం కలుగుతోంది. 
 
అందునా, మరో వారం రోజుల్లో అధ్యక్షుడిగా పదవి నుంచి నిష్క్రమించనున్న బైడెన్‌ ప్రభుత్వం జరిపే చర్చలకు ఏపాటి విలువ ఉంటుందన్నది ప్రశ్న. పదిహేను మాసాలుగా సాగుతున్న ఇజ్రాయిల్‌ దురాక్రమణ పూరిత దాడులకు స్వస్తి చెబితేనే బందీల విడుదల గురించి ఆలోచిస్తామని హమాస్‌ ఎప్పటి నుంచో చెబుతోంది. 
 
బందీలను బేషరతుగా విడుదలజేయాలని, ఆ తర్వాతే కాల్పుల విరమణ గురించి పరిశీలిస్తామని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అనడంతో చర్చల ప్రక్రియ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. పశ్చిమాసియాను అస్థిరపరిచేందుకు అమెరికా అండతో ఇజ్రాయిల్‌ ఇష్టానుసారంగా చెలరేగిసోతోంది. గాజాలో మొదలై యెమెన్‌, లెబనాన్‌, సిరియా కు దాడులను విస్తరింపజేసేందుకు ఇజ్రాయిల్‌ యత్నిస్తోంది. 
 
తాజా చర్చల విషయానికి వస్తే మధ్యవర్తిత్వం వహిస్తున్న గల్ఫ్‌ దేశం ఖతార్‌ ఇజ్రాయిల్‌తో ఏదో ఒక రకమైన ఒప్పందానికి రావాలని హమాస్‌పై ఒత్తిడి పెంచుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరో వైపు ట్రంప్‌ దూత స్టీవ్‌ విట్‌కాఫ్‌ ఇటీవల ఈ చర్చల్లో పాల్గొని హమాస్‌తో ఒప్పందానికి రావాలని ఇజ్రాయిల్‌ను కోరినట్లు పాశ్చాత్య మీడియా తెలిపింది.