ఇంత దురహంకారం మంచిది కాదు

ఇంత దురహంకారం మంచిది కాదు

* తమిళనాడు సీఎం స్టాలిన్ పై గవర్నర్ మండిపాటు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కు ఇంత దురహంకారం పనికిరాదని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మండిపడ్డారు. తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా జాతీయ గీతానికి, రాజ్యాంగానికి జరిగిన అవమానాన్ని దేశం క్షమించదని హెచ్చరించారు. ఈ ఏడాది జనవరి 6న అసెంబ్లీలో ప్రసంగించకుండా గవర్నర్‌ వెళ్లిపోయినప్పటి నుంచి ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య ఈ వివాదం నడుస్తోంది.

జనవరి 6న తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ముందు తమిళనాడు రాష్ట్ర గీతం ఆలపించారు. ఆ తర్వాత జాతీయగీతం కూడా ఆలపించాలని గవర్నర్‌ కోరగా ప్రభుత్వం నిరాకరించింది. దాంతో అందుకు నిరసనగా గవర్నర్‌ ప్రసంగం చేయకుండానే అలిగివెళ్లిపోయారు. దీనిపై సీఎం ఎంకే స్టాలిన్‌ మాట్లాడుతూ గవర్నర్‌ తీరు ‘పిల్ల చేష్ట’ అని ఎద్దేవా చేశారు. 

తమిళనాడు సాంప్రదాయం ప్రకారం గవర్నర్‌ ప్రసంగానికి ముందు రాష్ట్ర గీతం, ప్రసంగం తర్వాత జాతీయ గీతం ఆలపిస్తారని చెప్పారు. కానీ, గవర్నర్‌ మాత్రం ప్రసంగానికి ముందు, తర్వాత కూడా జాతీయ గీతాన్ని ఆలపించాలని డిమాండ్‌ చేయడం రాష్ట్ర సాంప్రదాయానికి విరుద్ధమని స్టాలిన్‌ పేర్కొన్నారు.  గవర్నర్‌ చర్యను సీఎం స్టాలిన్‌ ‘పిల్ల చేష్ట’ గా అభివర్ణించడంపై గవర్నర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరీ ఇంత దురహంకారం మంచిది కాదని వ్యాఖ్యానించారు. తన ప్రసంగానికి ముందు జాతీయ గీతం ఆలపించకుండా తమిళనాడు అసెంబ్లీలో జాతీయగీతాన్ని, రాజ్యాంగాన్ని అవమానించారని ఆయన విమర్శించారు. జాతీయ గీతాన్ని ఆలపించడం, గౌరవించడం దేశంలోని ప్రతి పౌరుడి విధిగా రాజ్యాంగం చెబుతోందని, కానీ తమిళనాడు సర్కారు రాజ్యాంగాన్ని ఖాతరు చేయలేదని గవర్నర్ ఆరోపించారు.

కాగా 2021 నుంచి కూడా తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.  గతంలో కూడా గవర్నర్‌ ప్రభుత్వ ప్రసంగ ప్రతిని స్కిప్‌ చేస్తూ చదవడం వివాదాస్పదమైంది. దాంతో గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని డీఎంకే ఆరోపిస్తున్నది.