కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కొట్టుకున్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
జిల్లా సమీక్షా సమావేశంలో మాట్లాడేందుకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సిద్ధమవుతుండగా, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కలుగజేసుకుని మీరు ఏ పార్టీ? అంటూ నిలదీశారు. ఎమ్మెల్యే సంజయ్‌కు మైక్ ఇవ్వొద్దని కౌశిక్‌రెడ్డి హల్‌చల్ చేశారు. తనకు మైక్ ఎందుకు ఇవ్వకూడదని సంజయ్ ప్రశ్నించగా, ఏ పార్టీనో ముందు చెప్పి మాట్లాడాలని కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. సంజయ్ మైక్‌లో మాట్లాడుతుండగా అడ్డుకున్నారు.
దమ్ముంటే కాంగ్రెస్ టికెట్‌పై గెలవాలని సవాల్ చేశారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. వాగ్వాదం కాస్తా ముదిరి ఇద్దరూ ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. మంత్రుల ఎదుటే కొట్టుకున్నారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు కౌశిక్ రెడ్డిని కలెక్టరేట్ నుంచి బలవంతంగా బయటకు లాక్కెళ్లారు.
వివాదం నేపథ్యంలో అక్కడంతా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
కాగా, బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడడం ఏంటని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. మరోవైపు కౌశిక్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ వివాదాలు ఉంటాయని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని మంత్రి ఉత్తమ్ తీవ్రంగా ఖండించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను అడ్డుకుని దాడి చేయడంపై కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు.
బయటకు వచ్చిన అనంతరం పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ బీఫామ్‌తో గెలిచి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేని అంటూ చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ తరఫున మాట్లాడితే మేం చూస్తూ కూర్చోవాలా? అని ప్రశ్నించారు. ఏ పార్టీ అని అడిగితే దాడి చేసినట్టా? అని నిలదీశారు. వందల మంది పోలీసులతో తనను లాక్కొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన స్పష్టంచేశారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి