24కు పెరిగిన కార్చిచ్చు మృతుల సంఖ్య

24కు పెరిగిన కార్చిచ్చు మృతుల సంఖ్య

* ఇళ్లను వీడాలని 1.5 లక్షల మందికి ఆదేశం!

అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఇంకా వ్యాపిస్తూనే ఉంది. ఈ కార్చిచ్చు బారిన పడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 24కు పెరిగింది. కాగా మరో 16 మంది ఆచూకీ తెలియడం లేదు. తీవ్రమైన గాలులు వీస్తుండడం వల్ల మంటలు ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీనితో ముందు జాగ్రత్త చర్యగా లాస్‌ ఏంజెలెస్‌ కౌంటీలోని 1.5 లక్షల మందిని నివాసాలు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. 

ఇప్పటి వరకు కార్చిచ్చుతో 62 చదరపు మైళ్ల విస్తీర్ణంలోని అన్నీ దగ్ధమయ్యాయని, ఇది శాన్‌ ఫ్రాన్సిస్కో వైశాల్యం కన్నా చాలా ఎక్కువని అధికారులు తెలిపారు. అయితే పాలిసేడ్స్‌ ఫైర్‌ను 11 శాతం, ఎటోన్‌ ఫైర్‌ను 15 శాతం అదుపు చేయగలిగినట్లు పేర్కొన్నారు. మంటలను ఆర్పివేయడానికి స్థానిక అగ్నిమాపక దళంతో పాటు కెనడా, మెక్సికో నుంచి వచ్చిన అదనపు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

మొత్తంగా 14 వేల మంది సిబ్బంది, 1,354 అగ్నిమాపక యంత్రాలు, 84 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కార్చిచ్చును అదుపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఇళ్లు కోల్పోయి సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి నిత్యావసరాలు, దుస్తులు అందించేందకు దాతలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.

లమైన గాలులు బుధవారం వరకు ప్రమాదాన్ని తీవ్రతరం చేసే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ వెల్లడించింది. రెడ్ ఫ్లాగ్ హెచ్చరికలను జారీ చేసింది. గంటకు 80 కి.మీ నుంచి 113 కి.మీ వరకు గాలులు వీస్తాయని అంచనా వేసింది. దీంతో మంగళవారం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉందొచ్చని పేర్కొంది.

హాలీవుడ్‌ స్టార్లు లాస్‌ ఏంజెలెస్‌లోని నీటి వనరులను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తున్నారని, దీని వల్లనే ఇప్పుడు వేల ఇళ్లను మంటల బారి నుంచి కాపాడేందుకు వీలు లేకుండా, నీటి కొరత ఎదురవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. కాగా, చాలామంది ధనవంతులు, సెలబ్రిటీలు తమ సామాన్లు, కార్లను ఇళ్లలోనే వదిలేసి బతుకుజీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ విపత్తును కొందరు అవకాశంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్నారు.  ఇప్పటి వరకూ దొంగతనాలకు పాల్పడుతున్న 29 మందిని అరెస్ట్‌ చేశారు.

స్టార్లు తమకు కేటాయించిన నీటి కంటే కొన్ని రెట్లు అదనంగా వాడుకొని తమ తోటలను పెంచుతున్నారని డెయిలీ మెయిల్‌ కథనంలో పేర్కొంది. మంటల ధాటికి ఇప్పటి వరకూ 12,000 నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అంతేకాదు, పాలిసేడ్స్‌లో 23,707, ఏటోన్‌లో 14,117ఎకరాలు, కెన్నెత్‌లో 1,052, ముర్సెట్‌లో 779 ఎకరాలు దగ్ధమైనట్లు పేర్కొంది.