ఇంట్లో తుపాకీ కాల్పులతో ఆప్ ఎమ్మెల్యే మృతి

ఇంట్లో తుపాకీ కాల్పులతో ఆప్ ఎమ్మెల్యే మృతి
 పంజాబ్ అధికార ఆప్ శాసనసభ్యుడు గురుప్రీత్ బస్సీ గోగి (58) శుక్రవారం రాత్రి తన నివాసంలో బుల్లెట్ గాయాలతో మరణించారు. ఆయన తలపై బుల్లెట్ గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే డిఎంసి ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆయన మరణించినట్లు ప్రకటించారు.  బస్సీ ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ప్రమాదవశాత్తూ తనను తాను కాల్చుకున్నారా? అనేది శవపరీక్ష నివేదిక ద్వారా నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు.
 
“ఈ సంఘటన అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఆయనను డిఎంసి ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు ఆయన మరణించినట్లు ప్రకటించారు…” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) జస్కరన్ సింగ్ తేజ తెలిపారు. “కుటుంబ సభ్యుల ప్రకారం, అతను ప్రమాదవశాత్తు తనను తాను కాల్చుకున్నాడు. అతని తలపై బుల్లెట్ గాయాలు అయ్యాయి. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి కారణం స్పష్టంగా తెలుస్తుంది…” అని చెప్పారు. 
 
ఒక ప్రజా కార్యక్రమం నుండి తిరిగి వచ్చిన వెంటనే, రాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మరొక గదిలో ఉన్న అతని భార్య తుపాకీ కాల్పుల శబ్దాలు విని రాగా రక్తపు మడుగులో పడి అన్నట్లు చూసింది. గోగి భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు. 
 
ప్ర‌మాద‌వ‌శాత్తు త‌న‌కు తానే ఆయ‌న కాల్చుకున్న‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. త‌ల‌లోనే రెండు బుల్లెట్ గాయాలు ఉన్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. ఆస్ప‌త్రికి త‌ర‌లించే లోపే ఎమ్మెల్యే ప్రాణాలు విడిచిన‌ట్లు పేర్కొన్నారు.
 
గోగి భార్య సుఖ్‌చైన్ కౌర్ గోగి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2022లో గోగి ఆప్‌లో చేరి, లూథియానా (పశ్చిమ) అసెంబ్లీ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన భరత్ భూషణ్ ఆశును ఓడించారు. 2022లో శాసనసభ్యుడు కావడానికి ముందు గోగి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ నుండి లూథియానా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ఉన్నారు.
 
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, గోగికి పంజాబ్ స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్‌పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు.  తన లైసెన్స్ పొందిన పిస్టల్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు, ప్రమాదవశాత్తు పేలి మరణించినట్లు భావిస్తున్నారు. ఆయన 2014 నుండి 2019 వరకు కాంగ్రెస్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.