మళ్లీ లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో కలిసే ప్రసక్తి లేదు

మళ్లీ లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో కలిసే ప్రసక్తి లేదు

నితీశ్‌ కుమార్‌కు తమ తలుపులు తెరిచే ఉన్నాయని ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యపై జేడీయూ సీనియర్‌ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ స్పందిస్తూ మళ్లీ లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో కలిసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మళ్లీ ఆ పొరపాటు చేయబోనని చెప్పారు. 

గతంలో 2014 ఎన్నికల తర్వాత, 2020 తర్వాత రెండు దఫాలు ఆర్జేడీ సారధ్యంలోని గ్రాండ్‌ అలయెన్స్‌లో జనతాదళ్‌ యూ నేత నితీశ్‌ కుమార్‌ జత కట్టారు. కానీ కూటమి పక్షాల మధ్య విభేదాలతో ఆయన తిరిగి బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏలో చేరారు. ‘అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని’ ప్రతిపక్షంతో ‘పొరపాటున’ పొత్తులు పెట్టుకున్నానని నితీశ్ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర వ్యాప్త ప్రగతి యాత్రలో భాగంగా ఉత్తర బీహార్ జిల్లా ముజఫర్‌పూర్‌లో విలేకరులతో నితీశ్ మాట్లాడుతూ, ‘మాకు ముందు అధికారంలో ఉన్నవారు ఏదైనా చేశారా? జనం సూర్యాస్తమయం తరువాత తమ ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడుతుండేవారు. రెండు సార్లు వారితో పొత్తు పెట్టుకోవడం ద్వారా నేను పొరపాటు చేశాను’ అని పేర్కొన్నారు.

‘అప్పట్లో మహిళల స్థితి ఎలా ఉండేది? ఇప్పుడు మీరు ఈ స్వయంసహాయక బృందాలను చూడగలరు. ఈ బృందాలకు జీవిక అని పేరు పెట్టాం. కేంద్రం మా మోడల్‌ను అనుసరించి అజీవిక అని నామకరణం చేసింది. ఇంతకు ముందు అటువంటి దృఢవిశ్వాసం ఉన్న గ్రామీణ మహిళలను మీరు చూశారా?’ అని రాష్ట్రానికి దీర్ఘ కాలంగా సిఎంగా ఉన్న నితీశ్ తెలిపారు. అయితే, లాలూ ఆఫర్‌ పై ప్రశ్నలకు నితీశ్ సమాధానం ఇవ్వలేదు.

త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌ కుమార్ తమ సీఎం అభ్యర్థి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించిన తర్వాత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నితీశ్‌ కుమార్‌కు మహా కూటమి తలుపులు తెరిచే ఉన్నాయని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, రాష్ట్ర బిజెపి నాయకులు కూడా 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ ‘ముఖ్యమంత్రి’ అభ్యర్థి జెడి (యు) అధ్యక్షుడు నితీశ్ అని స్పష్టం చేశారు.

 గత ఏప్రిల్‌- జూన్‌ నెలల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి బీజేపీ కొద్ది దూరంలో నిలిచింది. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నితీశ్‌ కుమార్ సారధ్యంలోని జేడీయూ, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు సారధ్యంలోని టీడీపీ మద్దతు కీలకంగా మారింది.