
ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ జర్నలిస్ట్ (33) హత్యపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) ఆందోళన వ్యక్తం చేసింది. నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. బస్తర్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ మృతి కేసును పిసిఐ సుమోటోగా స్వీరించిందని, కేసుకు సంబంధించిన వాస్తవాలపై నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పిసిఐ చైర్‌పర్సన్ రంజనా ప్రకాశ్ దేశారు తెలిపారు.
ప్రెస్ అసోసియేషన్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కూడా జర్నలిస్ట్ హత్యను ఖండించాయి. ఈకేసుపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశాయి. రహదారి నిర్మాణంలో అక్రమాలను ఎత్తిచూపిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ జనవరి ఒకటిన అదృశ్యమయ్యాడు.
శుక్రవారం బీజాపూర్ పట్టణంలోని చత్తన్‌పరలో సురేష్ చంద్రకర్‌కి చెందిన స్థలంలోని సెప్టిక్ ట్యాంక్‌లో అతని మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. అతని సోదరుడు యుకేష్ చంద్రకర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ముఖేష్ చంద్రకర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గానే కాకుండా బస్తర్ జంక్షన్ అనే యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతున్నారు.
2021 ఏప్రిల్‌లో మావోయిస్టుల చెర నుండి కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌ను విడుదల చేయడంలో ముఖేష్ కీలక పాత్ర పోషించారు. భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, ముఖేష్ బందువులు రితేష్ చంద్రకర్, దినేష్ చంద్రకర్, సురేష్ చంద్రకర్, వారి దగ్గర పనిచేస్తున్న ఉద్యోగి మహేంద్ర రామ్‌టేక్‌లు హత్య చేశారని, ఇప్పటివరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సురేష్ చంద్రకర్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ కేసులో బిజెపి నేతల పాత్ర కూడా ఉన్నట్లు ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గతేడాది సురేష్ చంద్రకర్ బిజెపిలో చేరారని, అధికార పార్టీ నేతలతో దిగిన ఫొటోలు ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్ కమ్యూనికేషన్ వింగ్ చీఫ్ సుశీల్ ఆనంద్ శుక్లా తెలిపారు. సురేశ్ చంద్రాకర్ 10 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసాన్ని సందర్శించారని ఆరోపించారు.
గత 15 రోజుల సిఎం నివాసానికి సంబంధించిన సిసిటివి ఫుటేజీ, సందర్శకుల జాబితాను వెల్లడించాలని ఆయన కోరారు. సురేష్ చంద్రాకర్ అవినీతిని ముఖేష్ బయటపెట్టడం ఎందుకు చర్చకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. రూ.120 కోట్ల రహదారి కాంట్రాక్ట్‌లో 90% అడ్వాన్స్ చెల్లింపు చేయడం సాధ్యమేనా? అని శుక్లా ప్రశ్నించారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు