దేవాలయ నిర్వహణ హిందూ సమాజమే చేసుకోవాలి

దేవాలయ నిర్వహణ హిందూ సమాజమే చేసుకోవాలి
 
దేవాయ నిర్వహణ మొత్తం హిందూ సమాజం ఏకమై చేసుకోవాలని విశ్వహిందూ పరిషత్ అఖిల భారతీయ అధ్యక్షులు  అలోక్ కుమార్ పిలుపునిచ్చారు. ఇందులో అన్ని వర్గాల వారికీ ప్రాధాన్యం వుండాలని, వీరి ద్వారా స్వతంత్రంగా నిర్వహణ చేసుకునేలా వుండాలని, ప్రతిదీ పారదర్శకంగా వుండాలని ఆయన సూచించారు.
 
హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్ తో దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా మొదటగా విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద విశ్వహిందూ పరిషత్ ఆదివారం నిర్వహించిన హైందవ శంఖారావంలో మాట్లాడుతూ నిధుల వ్యయం విషయంలోనూ పారదర్శకంగా వుండాలని, వీటన్నింటినీ భక్తులే నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు.
 
దేవాలయాలకి సంబంధించిన ధనం రోడ్ల నిర్మాణానికో, ఇతరత్రా పనులకో ఖర్చు చేయడానికి వీల్లేదని,  హిందూ సమాజం పనులకు మాత్రమే ఖర్చు చేయాలని ఆయన తేల్చి చెప్పారు. దేవాలయ ట్రస్టుల ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వ పెత్తనం వుండొద్దని, దేవాయల నిర్వహణ కిందే వుండాలని అలోక్ కుమార్ తెలిపారు.
 
ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు 1817లో ఆలయాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని అలోక్ కుమార్ విమర్శించారు. హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం‌ చేయడానికి ఆలయాలను స్వాధీనం చేసుకున్నాయని ఆయన ఆరోపించారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలే ఆలయాలపై పెత్తనం చేస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఆలయాలకు‌ చెందిన లక్షల ఎకరాలను అన్యాక్రాంతం చేశారని ఆయన మండిపడ్డారు. 
 
ఎవరికీ లేని ఆంక్షలు, నిబంధనలు ఆలయాల పైనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వాలు పెత్తనం చేస్తూ, కొన్ని చోట్ల అన్యమతస్తులకు నిర్వహణ బాధ్యతలు ఇచ్చారని ఆయన చెప్పారు. అలాంటి వారు ఆలయాల పవిత్రత, హిందూ ధర్మపరిరక్షణను ఏం పట్టించుకుంటారని ఆయన ప్రశ్నించారు.
 
దక్షిణ భారతంలో వున్న ఐదు రాష్ట్రాల్లో ఐదు లక్షల ఎకరాల దేవాలయ భూములున్నాయని, వీటన్నింటినీ ఆంగ్లేయులు గమనించి, దేవాలయాలను తమ చేతుల్లోకి తీసుకున్నారని అలోక్ కుమార్ తెలిపారు. ఇతర మతాల ప్రార్థనా మందిరాలను మాత్రం ముట్టుకోలేదని, ఇదంతా ఓ కుట్ర అని ఆయన ఆరోపించారు. మరో వైపు పెద్ద పెద్ద ఆలయాలకి వచ్చే ధనాన్ని ధర్మ రక్షణ కోసమే వినియోగించాలని అలోక్ కుమార్ స్పష్టం చేశారు.
 
తిరుమల తిరపతి దేవస్థానికి సంబంధించిన ధనాన్ని 12 శాతం ఆడిట్ కోసం, కామన్ గుడ్ ఫండ్,నిర్వహణ.. ఇలా వివిధ పనుల కోసం మందిరాల ధనాన్ని వినియోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనిని హిందువులమైన తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వాలు వివిధ చట్టాలను చేసి దేవాలయాలను తమ చేతుల్లోకి తీసుకున్నారని పేర్కొన్నారు. 
 
దేవాలయ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులు, ఇతరత్రా ఉద్యోగులు నియామకం, బదిలీలు.. ఇలా కీలకమైనవన్నింటి అధికారం దేవాలయ కమిటీకి లేకుండా . ప్రభుత్వాలు తమ చేతుల్లోకి తీసుకున్నాయని అలోక్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం అన్న పేరుతో ప్రభుత్వాలు ఇవన్నీ తమ చేతుల్లోకి తీసుకున్నాయని ధ్వజమెత్తారు.
 
 నిజానికి ఈ పనులు చేయాల్సింది దేవాలయ ధర్మకర్తల మండలి, ధర్మాచార్యులు, భక్త సమాజమని  పేర్కొంటూ  ఈ అధికారాలన్నింటినీ తిరిగి హిందువుల చేతికి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
 
200 సంవత్సరాలుగా హిందువులకు ఈ అన్యాయం జరుగుతోందని, దేవాలయాల విషయంలో హిందువులకు తీవ్ర అన్యాయం జరుగుతోంద చెప్పారు. హిందువులు తమ దేవాలయాల విషయంలో చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వాలన్నీ శ్రద్ధతో గమనించాలని, వెంటనే దేవాలయాలను తమ చేతుల నుంచి విముక్తం చేయాలని అలోక్ కుమార్ డిమాండ్ చేశారు.
 
మందిరాలంటే కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదని, భగవంతుని నివాసాలని అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి పూజ్యశ్రీ గోవిందా దేవగిరి స్వామిజీ చెప్పారు. అందులో భగవంతుడ్ని జ్యోతి రూపంలో ప్రతిష్ఠ చేసుకుంటామని, అందుకే దేవాలయాలను హైందవ సమాజం కాపాడుకోవాలని ఆయన  పిలుపునిచ్చారు.  దేవాలయాలు మనకు ప్రేరణను కలిగిస్తాయని, మనిషిలోని అంతర్గత జ్యోతిని వెలిగిస్తాయన్నారు. ఈ విశాల సమూహం దేవాలయాల రక్షణకు పాటుపడాలని ఆయన కోరారు.
 
అయోధ్య ప్రాణ ప్రతిష్ఠను యావత్ హిందూ సమాజం చేపట్టిందని స్వామీజీ పేర్కొన్నారు. అక్కడ పూజా వ్యవహారాలు, నిర్వహణ అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ఏ ప్రభుత్వం ఒత్తిడి లేకుండానే అయోధ్యలో అత్యంత శ్రద్ధతో, సంప్రదాయాలతో నడుపుతున్నామని గుర్తు చేశారు. నిధుల విషయంలో, పూజల విషయంలో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
 
మన బతుకులు బాగుండాలంటే ఆలయ వ్యవస్థ బాగుండాలని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిజీ తేల్చి చెప్పారు. గతంలో మహారాజులు, జమీందార్లు ఆలయాలు కట్టారని, వందల ఎకరాల భూములు ఇచ్చారు, లక్షల విలువైన ఆభరణాలు ఇచ్చారని గుర్తు చేశారు. వాటి పోషణకు వ్యవస్థలు ఏర్పాటు చేశారని, అప్పుడే సమాజం సుఖశాంతులతో ఉంటుందనే సంకల్పం వారిదని తెలిపారు.
 
మన రాష్ట్రంలోనే ఆలయాలకు సుమారు 15 లక్షల ఎకరాల భూములు ఉండేవని చెబుతారని, అవి క్రమంగా మంచు కరిగినట్లుగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ చేతిలోకి వెళ్ళాక కరిగిపోయాయని ఆయన విమర్శించారు. ఇప్పుడు కేవలం 4.5లక్షల ఎకరాలు మాత్రమే మిగిలాయని పేర్కొన్నారు. ఆలయ వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలు ఎవరు చేయాలి? అవేమిటో అసలు ఏమీ తెలీని అధికారులు చేయాలా? అది అడగడానికే అందరూ వచ్చారని, అది ఎవరిని అడగాలో తెలియడానికే విశ్వహిందూ పరిషత్ ఈ సభ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.