అమెరికాలో వరుస దాడుల వెనుక ఐ ఎస్ ఉగ్రవాదులు!

అమెరికాలో వరుస దాడుల వెనుక ఐ ఎస్ ఉగ్రవాదులు!
 
ట్రంప్‌ సర్కారు కొలువుదీరే వేళ  ప్రజలంతా కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగి ఉండగా అమెరికాలో ఉగ్రవాద ఘటనలు కలకలం రేపుతున్నాయి. వరుస ఘటనలతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. 24 గంటల వ్యవధిలో మూడు దాడులు జరగడం, దాడులన్నీ ఉగ్రవాద చర్యలనే అనుమానాలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. 
 
మూడు దాడుల్లో 16 మంది మరణించగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం న్యూఓర్లీన్స్‌ నగరంలో న్యూ ఇయర్‌ వేడుకల్లో మొదటి దాడి జరగగా, కొన్ని గంటల వ్యవధిలోనే లాస్‌ వెగాస్‌లోని ట్రంప్‌ టవర్‌ సమీపంలో పేలుడు సంభవించింది. బుధవారం రాత్రి న్యూయార్క్‌లోని ఓ నైట్‌క్లబ్‌ ముందు మూడో దాడి చోటు చేసుకున్నది.
కాగా, అమెరికాలోని న్యూ ఆర్లిన్స్‌లో జరిగిన ఉగ్రదాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్టు చేశారు.  మరోవైపు న్యూఓర్లీన్స్‌లో దాడికి తెగబడ్డ వ్యక్తి ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ నుంచి ప్రేరణ పొందిన మాజీ సైనికుడు షంషుద్దీన్‌ జబ్బార్‌ (42) అని పోలీసులు గుర్తించారు. దీంతో మిగతా రెండు దాడులు కూడా ఒక ప్రణాళిక ప్రకారం, సమన్వయంతో జరిగాయా అనే దిశగా దర్యాప్తు జరుగుతున్నది.

జబ్బార్ ను పోలీసు లు కాల్చి చంపగా, ఘటనకు ఉపయోగించిన కారులో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) జెండా, పేలుడు పదార్థాలున్నట్లు నిర్ధారించారు. అతను ఒంటరి తోడేలు(లోన్‌ వోల్ఫ్‌) దాడి చేసి ఉంటాడని భావిస్తున్నారు. టెక్సాస్ కు చెందిన జబ్బార్‌ అమెరికా పౌరుడు కాగా, అతను యుక్తవయసులోనే ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. 

2005-15 మధ్య కాలంలో అమెరికా సైన్యంలో మానవ వనరులు-సమాచార విభాగంలో మేనేజర్‌గా పనిచేశాడు. 2009లో ఆఫ్ఘానిస్థాన్‌లో కూడా విధులు నిర్వర్తించాడు. 2015-20 మధ్యకాలంలో ఆర్మీ రిజర్వ్‌లో ఐటీ నిపుణుడిగా సేవలందించాడు. గత ఏడాది నౌకాదళంలో చేరేందుకు జబ్బార్‌ పేరు ఖరారైన  బూట్‌క్యాంప్‌ వెళ్లకపోవడంతో తొలగించారు. 

2021 నుంచి అతను డెలాయిట్‌ ఆడిటింగ్‌ సంస్థలో ఏటా 1.2 లక్ష ల డాలర్ల వేతనంతో సీనియర్‌ సొల్యూషన్‌ స్పెషలి స్ట్‌గా పనిచేశాడు. జబ్బార్‌కు గత నేర చరిత్ర కూడా పెద్దగా లేదని, 2014లో డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిన రికార్డు మాత్రం ఉందని, 2002లో హారి్‌సకౌంటీలో ఓ చిల్లర దొంగతనం కేసులో 9 నెలలపాటు కమ్యూనిటీ సూపర్‌విజన్‌ శిక్షను అనుభవించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. 

అతనికి రెండు పెళ్లిళ్లవ్వగా, విడాకులు తీసుకున్నాడని, రెండో భార్య కేసులో తాను పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ట్లు, తన రియల్‌ఎస్టేట్‌ కంపెనీ కూడా నష్టాల్లో ఉం దని లాయర్‌కు చెప్పినట్లు పేర్కొన్నారు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ వైపు ఆకర్షితుడై ‘చంపడం’ అనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఎఫ్‌డీఐ గుర్తించిందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మీడియాకు చెప్పారు. 

ఘటనకు ముందు అతను సోషల్‌ మీడియాలో సెల్ఫీ వీడియోను పోస్టు చేశాడని, ఎఫ్‌బీఐ కూడా దాడిపై తనకు ముందుగానే సమాచారం ఇచ్చిందని వివరించారు. ‘టూరో’ అనే యాప్‌ సాయంతో ఫోర్డ్‌ ఎఫ్‌-150లైటెనింగ్‌ అనే భారీ ఎలక్ట్రిక్‌ పికప్‌ ట్రక్కును అద్దెకు తీసుకున్నాడని, ఆ వాహనంతోనే న్యూ ఆర్లిన్స్‌లో దారుణానికి ఒడిగట్టాడని గుర్తించామని పేర్కొన్నారు. ఘటనాస్థలం నుంచి ఇంట్లో తయారు చేసిన పైప్‌బాంబులు, గ్రెనేడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడి తీరును బట్టి ఒంటరిగా చేసినది కాకపోవచ్చని ఎఫ్‌బీఐ అనుమానిస్తున్నది.

మరోవైపు, లాస్‌ వెగా్‌సలోని డొనాల్డ్‌ ట్రంప్‌నకు చెందిన ఇంటర్నేషనల్‌ హోటల్‌ వెలుపల టెస్లా సైబర్‌ట్రక్‌ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. ఏడుగురు గాయపడ్డారు. కారులో ఉన్న పేలుడు పదార్థాల కారణంగా ఈ ఘటన జరిగిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అయితే న్యూ ఆర్లిన్స్‌, లాస్‌ వెగాస్‌ సంఘటనలకు సంబంధం ఉండి ఉంటుందని స్పేస్‌ ఎక్స్‌ చీఫ్‌ ఈలాన్‌ మస్క్‌ అనుమానం వ్యక్తం చేశారు. 
 
ఈ రెండు ఘటనల్లోనూ దుండగులు ‘టూరో’ నుంచి వాహనాలను అద్దెకు తీసుకున్నట్లు గుర్తుచేశారు. కాగా, లాస్‌ వెగాస్‌ ఘటన జరిగిన కొన్ని గంటల్లోన  ఫ్రిమాంట్‌ స్ట్రీట్‌లో ఓ దుండగుడు హల్‌చల్‌ చేశాడు. ఓ బస్సులో తనను తాను బంధించుకున్న దుండగుడి వద్ద పేలుడు పదార్థాలున్నట్లు పోలీసులు అనుమానించారు. న్యూ ఆర్లిన్స్‌ తరహాలో దాడికి దుండగుడు కుట్రపని ఉండవచ్చని భావిస్తున్నారు.

న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో మూడో దాడి జరిగింది. బుధవారం రాత్రి ఒక నైట్‌ క్లబ్‌ బయట నిలబడ్డ వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు దాదాపు 30 సార్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల తర్వాత నిందితులు కారులో పారిపోయినట్టు తెలిపారు.