అల్లు అర్జున్‌కు భారీ ఊరట.. రెగ్యుల‌ర్ బెయిల్

అల్లు అర్జున్‌కు భారీ ఊరట.. రెగ్యుల‌ర్ బెయిల్

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో అగ్ర న‌టుడు అల్లు అర్జున్‌కి భారీ ఊరట ల‌భించింది. అల్లు అర్జున్‌కు నాంప‌ల్లి కోర్టు రెగ్యుల‌ర్ బెయిల్‌ను మంజూరు చేసింది.సంధ్య థియేటర్​ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి బన్నీపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ హైకోర్టు​ మధ్యంతర బెయిల్​పై ఉన్నారు. రెగ్యులర్​ బెయిల్​పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగియగా తాజాగా న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

రెండు రూ.50వేల పూచీకత్తులు సమర్పించాలని అర్జున్​ను కోర్టు ఆదేశించింది. అల్లు అర్జున్​కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్​ను మంజూరు చేసిందని ఆయన తరఫు న్యాయవాది అశోక్​రెడ్డి తెలిపారు.  సాక్షులను ఏ విధంగానూ ప్రభావితం చేయొద్దని సూచించింది. కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా ఎలాంటి కామెంట్స్ చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. 

ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణ హాజరు కావాలని షరతు విధించింది. ఈ నెల 4న పుష్ప బెనిఫిట్‌ షో రోజు సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. 

మరోవైపు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించగా, ఈ నెల 27న రిమాండ్ ముగిసింది. అదే రోజు ఆయన వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అప్పుడే ఆయన తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ విచారణ వాయిదా పడగా, సోమవారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది.

అల్లు అర్జున్ న్యాయవాది వాదనలను ఏకీభవించిన న్యాయస్థానం.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్‌పై బిఎన్ఎస్ యాక్ట్ 105 వర్తించదని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కారణం కాదని వాదించారు. 

సంఘటన జరిగిన ప్రాంతానికి, అల్లు అర్జున్ వచ్చిన ప్రాంతానికి 30 మీటర్లు దూరం ఉందని కోర్టుకు వివరించారు న్యాయవాది. అయితే, అల్లు అర్జున్ రావడం వలనే తోపులాట జరిగి, తొక్కిసలాట జరిగిందని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. అల్లు అర్జున్ రాకపోతే ఈ సంఘటన జరిగి ఉండేది కాదున్నారు పీపీ. అల్లు అర్జున్ పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అతనికి బెయిల్ మంజూరు చేస్తే కేసు విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని పీపీ వాదించారు.

పుష్ప-2 బెనిఫిట్​ షో సందర్భంగా కొద్ది రోజుల క్రితం సినీ హీరో అల్లు అర్జున్​ సంధ్య థియేటర్​కు వెళ్లారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్​ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే దిల్​సుఖ్​నగర్​కు చెందిన రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు కూడా కిందపడిపోయి జనాల కాళ్ల మధ్య నలిగిపోయారు. 

ఈ ఘటనలో రేవతి మృతిచెందారు. కాగా ఆమె కుమారుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేవతి కుటుంబ సభ్యులకు ఇప్పటికే అల్లు అర్జున్​ కోటి రూపాయల ఆర్థిక సహాయం చేశారు. మరోవైపు పుష్ప-2 చిత్ర నిర్మాతలు కూడా సాయమందించారు. అల్లు అర్జున్ సహా 18 మందిపై కేసు నమోదు చేశారు.