అయోధ్య వివాదంలో కీలక మధ్యవర్తి కునాల్ మృతి

అయోధ్య వివాదంలో కీలక మధ్యవర్తి కునాల్ మృతి

అయోధ్య వివాదంలో కీలక మధ్యవర్తి, బీహార్‌లో ఆలయాల్లో దళిత పూజారుల నియామకానికి మార్గం సుగమం చేసిన మాజీ ఐపిఎస్‌ అధికారి ఆచార్య కిషోర్‌ కునాల్‌ (74) ఆదివారం ఉదయం మరణించారు. పాట్నాలో గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.1972 బ్యాచ్‌ గుజరాత్‌ కేడర్‌ ఐపిఎస్‌ అధికారి, కునాల్‌ 2001లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసేవరకు బీహార్‌, జార్ఖండ్‌, గుజరాత్‌లలో పనిచేశారు.

1989లో, ప్రధాన మంత్రి పి.వి. సింగ్‌ హయాంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయోధ్యకు ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఒఎస్‌డి)గా నియమించబడ్డారు. తర్వాతి ప్రధానులు చంద్రశేఖర్‌, పి.వి. నరసింహారావుల హయాంలో కూడా ఆయన ఒఎస్‌డిగా కొనసాగారు. అయోధ్య రామజన్మభూమి, బాబ్రీమసీదు వివాదంలో యాక్షన్‌ కమిటీల మధ్య చర్చలు జరపడంలో కీలక పాత్ర పోషించారు. 

2001లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత, దర్భంగాలోని కెఎస్‌ సంస్కృత విశ్వ విద్యాలయానికి వైస్‌ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. పాట్నాలోని ప్రసిద్ధ హనుమాన్‌ మందిర్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సమయంలో 1993న జూన్‌13న బీహార్‌లోని ఓ దేవాలయంలో మొదటి దళిత పూజారిని నియమించారు. అనంతరం బీహార్‌ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ రిలీజియస్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పాటు కొనసాగిన సమయంలో, బీహార్‌లోని అనేక దేవాలయాలలో దళిత పూజారులను నియమించారు.