హీరోలు ఆర్భాటంగా వెళ్లడంతోనే థియేటర్ల వద్ద తొక్కిసలాట

హీరోలు ఆర్భాటంగా వెళ్లడంతోనే థియేటర్ల వద్ద తొక్కిసలాట
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన తెలుగు చిత్ర పరిశ్రమలో సృష్టించిన కలకాలంపై స్పందిస్తూ ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ హీరోలు ఆర్భాటంగా థియేటర్ల వద్దకు ఇటీవల కాలంలో వెడుతూ ఉండడంతోనే ఇటువంటి ఘటనలకు ఆస్కారం కలుగుతున్నదని స్పష్టం చేశారు.

సంధ్య థియేటర్ ఘటనను ప్రస్తావిస్తూ ‘‘ఇటీవల జరిగిన పరిస్థితులను చూస్తే. ఇండస్ట్రీలోని వారే కాదు బయట ఉన్నవాళ్లకు కూడా ఒక స్పష్టత వస్తుంది. సినిమా వాళ్లను ఫ్యాన్స్‌ దేవుళ్లుగా చూస్తారు. దానికి అనుగుణంగా హీరోలు ఎక్కడికి వెళ్లినా నాలుగు కారుల్లో వెళ్లాలి. రోడ్‌ షో చేయాలని భావిస్తున్నారు. ఇలాంటివి ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారాయి. అలాకాకుండా సైలెంట్‌గా వెళ్లి సినిమా చూసి వచ్చేస్తే ఇలాంటి ఘటనలు జరగడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది” అని తెలిపారు. 

గతంలో హీరోలు ఇలా ఉండేవారు కాదని స్పష్టం చేశారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలు అభిమానులతో సినిమాలు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. “వారు సైలెంట్‌గా ఏదో ఒక మల్టీప్లెక్స్‌కు వెళ్లేవారు. సినిమా చూసేవారు. బయటకు వచ్చే సమయంలో అక్కడ ఉన్నవారితో కాసేపు మాట్లాడేవారు. ఒకవేళ సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌కు వెళ్లాల్సి వచ్చినా.. ఎవరికీ చెప్పకుండా థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి వచ్చేసేవారు” అని చెప్పారు.

“ఇప్పుడు అలా లేదు. సామాజిక మాధ్యమాల వల్ల ఏ హీరో ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అనే విషయం అభిమానులకు త్వరగా తెలిసిపోతుంది. దీంతో హీరోలను చూసేందుకు భారీ స్థాయిలోనే అభిమానులు తరలివస్తున్నారు” అని తెలిపారు. ఫ్యాన్స్‌, ప్రజా శ్రేయస్సు గురించి కూడా హీరోలు ఆలోచించాలని తమ్మారెడ్డి హితవు చెప్పారు. 

“మేము ఎక్కువ డబ్బు తీసుకుంటున్నామని హీరోలు అనిపించుకోవడం కోసం సినిమా టికెట్‌ రేట్లు పెంచాల్సి వస్తుంది. మీరు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. టికెట్‌ రేట్లు పెంచి ప్రజల మీద ఆ భారం వేస్తున్నారు” అంటూ నేటి ధోరణులను వివరించారు.  “హీరోలందరూ ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి. కలెక్షన్స్‌ పరంగా కాదు పెర్ఫార్మెన్స్‌ పరంగా తెలుగువారికి గర్వకారణంగా నిలవాలి. మీరు కూడా సాధారణ మనుషులమే అని భావిస్తే ఇలాంటి హడావుడి ఉండదు’’ అంటూ ఆయన సున్నితంగా మందలించారు.