కానిస్టేబుల్ వేధింపులు భ‌రించ‌లేక పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

కానిస్టేబుల్ వేధింపులు భ‌రించ‌లేక పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌
నాచారం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఓ కానిస్టేబుల్ వేధింపులు భ‌రించ‌లేక పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తాన‌ని తండ్రి తీసుకున్న డ‌బ్బులు తిరిగి ఇవ్వాల‌ని ఆమెను కానిస్టేబుల్ వేధింపుల‌కు గురిచేయ‌డంతో ఉరేసుకుంది. ఈ కేసులో ఇద్ద‌రిని అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. ఇద్ద‌రు ప‌రారీలో ఉన్న‌ట్లు స‌మాచారం.

వివ‌రాల్లోకి వెళ్తే నాచారంలోని బాపూజీన‌గ‌ర్ స‌ర‌స్వ‌తీ కాల‌నీకి చెందిన సంగీత రావు ఐఐసీటీలో ప‌ని చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయ‌న కూతురు పులివ‌ర్తి దీప్తి(28) హ‌బ్సిగూడ‌లోని ఐఐసీటీలో ప్రాజెక్టు అసిస్టెంట్‌గా ప‌ని చేస్తున్నారు. అయితే సంగీత‌రావుకు డీజీపీ కార్యాల‌యంలో కానిస్టేబుల్‌గా ప‌ని చేస్తున్న బెల్లా అనిల్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. 

అనిల్ భార్య అనిత‌కు ఐఐసీటీలో ఉద్యోగం ఇప్పిస్తాన‌ని చెప్పి, రెండేండ్ల క్రితం అత‌ని వ‌ద్ద సంగీత‌రావు రూ. 15 ల‌క్ష‌లు తీసుకున్నాడు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ వ‌ర‌కు కూడా అనిత‌కు సంగీత‌రావు ఉద్యోగం ఇప్పించ‌లేదు. అయితే సంగీత‌రావు అనిల్‌కు స‌మాధానం దాటేవ‌స్తూ వ‌చ్చాడు. చివ‌ర‌కు ఆయ‌న కూతురు దీప్తిని కానిస్టేబుల్ వేధింపుల‌కు గురి చేశాడు. 

డ‌బ్బు త‌న తండ్రి తీసుకున్నాడ‌ని, ఆయ‌న త‌మ‌తో చాలా ఏండ్ల నుంచి క‌లిసి ఉండ‌డం లేద‌ని స‌మాధానం చెప్పారు. అయినా అనిల్ అవేమీ ప‌ట్టించుకోకుండా  వేధింపుల‌కు గురి చేస్తూనే, నాచారం పీఎస్‌లో భార్య అనిత‌తో క‌లిపి ఫిర్యాదు చేశాడు. ఇక సంగీత‌రావు, దీప్తి మీద చీటింగ్ కేసు న‌మోదైంది. అనిల్, అనిత క‌లిసి కోర్టులో సివిల్ దావా కూడా వేశారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన దీప్తి బుధ‌వారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆమె ఫోన్‌ను ప‌రిశీలించ‌గా, సెల్ఫీ వీడియో ఉంది. దీప్తి త‌ల్లి ఫిర్యాదు మేర‌కు, సెల్ఫీ వీడియో ఆధారంగా అనిల్, అనిత‌, సోమ‌య్య‌, సైదులు మీద కేసు న‌మోదు చేశారు. అనిత‌, ఆమె తండ్రి సోమ‌య్య‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. అనిల్, సైదులు ప‌రారీలో ఉన్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

“నా మ‌ర‌ణానికి అనిల్, ఆయ‌న భార్య అనిత‌, ఆమె తండ్రి సోమ‌య్య కార‌ణం. నాన్న డ‌బ్బు తీసుకుంటే నా మీద నకిలీ కేసు న‌మోదు చేయించి జీవితాన్ని నాశ‌నం చేశారు. ఈ కేసుల మీద పోరాడే స్తోమ‌త నాకు లేదు. నా మ‌ర‌ణంతోనైనా కుటుంబానికి న్యాయం జ‌రుగుతుంది. నా చావుకు కార‌ణ‌మైన వాళ్ల‌కు శిక్ష‌ప‌డాలి. నా మృత‌దేహాన్ని వైద్య ప‌రిశోధ‌న‌కు అప్ప‌గించండి” అని క‌న్నీరు పెట్టుకుంటూ సెల్ఫీ వీడియోలో దీప్తి పేర్కొన్నారు.