రాజ్యాంగం, అంబెడ్కర్ అంశాలపై ఎన్డీయే ఉమ్మడిగా ఎదురు దాడి!

రాజ్యాంగం, అంబెడ్కర్ అంశాలపై ఎన్డీయే ఉమ్మడిగా ఎదురు దాడి!
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఇండియా కూటమి, ఇతర ప్రతిపక్షాలు రాజ్యాంగం, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అంశాలపై సాగిస్తున్న `దుష్ప్రచారం’ను  ఉమ్మడిగా ఎదుర్కోవాలని బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నేతలు నిర్ణయించారు. ఈ విషయమై అధికార ఎన్డీఏ నేతలు బుధవారం న్యూఢిల్లీలోని బిజెపి అధ్యక్షుడు,కేంద్ర మంత్రి జె పి నడ్డా నివాసంలో సమావేశమయ్యారు.
 
బిజెపి కీలక భాగస్వామి అయిన టిడిపి, కేంద్ర ప్రభుత్వం, పాలక కూటమిపై దాడి చేయడానికి ఇండియా కూటమి చేస్తున్న ఆందోళనలను ఎదుర్కొనేందుకు మెరుగైన ఎన్డీఏ సమన్వయం అవసరమని స్పష్టం చేసింది.  ముఖ్యంగా రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య అంబేద్కర్‌ను “అవమానించడం” అని కాంగ్రెస్ ఆరోపించిన తర్వాత ఇటువంటి అవసరం మరించ స్పష్టం అవుతుందని తెలిపింది.
 
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన కొన్ని గంటల తర్వాత, ఎన్డీఏ నాయకులు నడ్డా ఇంట్లో దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. అమిత్ షా వ్యాఖ్య, కుల గణన, సామాజిక న్యాయ రాజకీయాలపై బిజెపిపై ప్రతిపక్షాల దాడి గురించి నాయకులు చర్చించారు. 
కాంగ్రెస్ “తప్పుడు కథనాలను” సృష్టించడానికి ప్రయత్నిస్తోందని టిడిపి నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో సహా నాయకులకు అమిత్ షా తెలిపారు.
ప్రతిపక్షాలు “తప్పుడు కథనాన్ని” ప్రచారం చేస్తున్నాయని టిడిపి కూడా అభిప్రాయపడిందని ఎన్డీయే వర్గాలు తెలిపాయి. సందేశం స్పష్టంగా ఉంది: ఎన్డీఏ ప్రతిపక్ష కథనాన్ని ఐక్యంగా ఎదుర్కోవలసి ఉంటుంది. భాగస్వాముల మధ్య సమన్వయం అవసరం. అంబేద్కర్ పై షా చేసిన వ్యాఖ్యను ప్రజలను “తప్పుదోవ పట్టించడానికి” “ఒక సమస్య”గా చేసినందుకు కాంగ్రెస్ నాయకులు బిజెపిని లక్ష్యంగా చేసుకున్నారని ఆ వర్గాలు తెలిపాయి.
 
“సమావేశంలో, రాజ్యసభలో షా తన ప్రసంగంలో ఈ వ్యాఖ్య చేసినప్పుడు కాంగ్రెస్ ఎంపీలు ఎలా స్పందించలేదో మాకు తెలిపారు. కానీ తరువాత, రాహుల్ గాంధీ హాజరైన కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఆ వ్యాఖ్యను హైలైట్ చేయవలసిన అంశంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి, షా వ్యాఖ్యను దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే ఒక అంశంగా మార్చడానికి కాంగ్రెస్ కుట్ర పన్నింది,” అని చర్చలలో పాల్గొన్న ఉన్న ఒక నాయకుడు వెల్లడించారు. 
 
సీనియర్ కేంద్ర మంత్రులతో సహా బిజెపి నాయకులు ఎన్డీఏ సభ్యులకు “అంబేద్కర్‌ను అవమానించడం”, అత్యవసర పరిస్థితిని విధించడం వంటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల “దుష్కార్యాల” గురించి కూడా చెప్పారు. బిజెపి, ఎన్డీఏ మిత్ర పక్షాలు కాంగ్రెస్‌ స్వరూపాన్ని క్షేత్రస్థాయిలో “బహిర్గతం” చేయాలని, పంచ తీర్థాలను (ఐదు తీర్థాలు) అభివృద్ధి చేయడం వంటి అంబేద్కర్ జ్ఞాపకాలను గౌరవించడానికి, సంక్షేమ పథకాలలో దళితులకు సముచిత వాటా ఇవ్వడం ద్వారా వారి “సాధికారత” కోసం బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలకు చెప్పాలని బిజెపి పిలుపునిచ్చింది. 
 
సమావేశం తరువాత, బిజెపి మిత్ర పక్షాల నాయకులు నడ్డాను వ్యక్తిగతంగా కలుసుకుని, తమకు సంబంధించిన ఎజెండా, రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించారని ఆ వర్గాలు తెలిపాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ సమావేశంలో పాల్గొనలేదు. 
 
లోక్‌సభ ఎన్నికల్లో కూటమి సంఖ్య స్వల్పంగా తగ్గిన నెలల తర్వాత, మహారాష్ట్ర,  హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయాల పట్ల హాజరైన నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. జెడి(యు) తరపున కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ అలియాస్ లాలన్ సింగ్, శివసేన తరపున కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్‌రావు గణపత్రావ్ పాల్గొన్నారు.
 
కేంద్ర మంత్రి, జెడి (ఎస్) నాయకుడు హెచ్ డి కుమారస్వామి, పౌర విమానయాన మంత్రి, టిడిపి నాయకుడు కె రామ్మోహన్ నాయుడు, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా, కేంద్ర మంత్రులు అనుప్రియ పటేల్, జితన్ రామ్ మాంఝీ,  సంజయ్ నిషాద్ కూడా హాజరయ్యారు.
 
అమిత్ షా ఇటీవలి రాజకీయ పరిణామాలపై, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జరిగిన విషయాలు, దాని నుండి నేర్చుకున్న విషయాలపై సుదీర్ఘంగా మాట్లాడారని ఎన్డీయే వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ఎప్పుడూ అంబేద్కర్‌ను గౌరవించలేదని, కానీ ఇప్పుడు తనకు అనుకూలంగా కథనాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని, దీనిని బలంగా, ఐక్యంగా ఎదుర్కోవాలని ఆయన నాయకులకు చెప్పారు.
 
బెళగావిలో జరుపుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తరించిన సమావేశానికి ఒక రోజు ముందు ఎన్డీఏ సమావేశం జరగడం గమనార్హం. అక్కడ అంబేద్కర్ మరియు కుల జనాభా లెక్కల అంశాలపై బిజెపిపై కాంగ్రెస్ కొత్త దాడికి సమాయత్తం కానుంది. కాంగ్రెస్ సమావేశం తర్వాత జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ అనే పేరుతో బహిరంగ ర్యాలీ జరుగుతుంది. 1924లో మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అంబేద్కర్,  రాజ్యాంగంపై బిజెపి, ఎన్డీఏలను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.