కెనడాలో భారతీయుల అక్రమ రవాణాపై ఈడీ విచారణ

కెనడాలో భారతీయుల అక్రమ రవాణాపై ఈడీ విచారణ
మానవ అక్రమ రవాణా కేసులో కొన్ని కెనడా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, భారత్‌కు చెందిన సంస్థల పాత్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ జరుపుతున్నది. కెనడా నుంచి మన పౌరులను అమెరికాలోకి అక్రమంగా పంపేందుకు కొన్ని ముఠాలు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. 
 
కెనడా- అమెరికా సరిహద్దును అక్రమంగా దాటడానికి ప్రయత్నిస్తుండగా తీవ్రమైన చలికి తట్టుకోలేక గుజరాత్‌లోని డింగుచ గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు 2022 జనవరి 19న  మృతి చెందారు.  దీనిపై అహ్మదాబాద్‌ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకున్న ఈడీ భవేశ్‌ అశోక్‌ పటేల్‌, కొన్ని భారత సంస్థలపై మనీలాండరింగ్‌ కేసు పెట్టింది.
 
 ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ దళారీ ఏజెన్సీలు అమెరికా వెళ్లాలనుకునే వారికి, అమెరికాలో కాకుండ కెనడాలోని కొన్ని విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తాయి. కెనడా వీసా వచ్చిన వెంటనే వారు ఆయా విద్యాసంస్థల్లో చేరకుండా అక్రమంగా యూఎస్‌- కెనడా సరిహద్దు ద్వారా అమెరికా వలసదారులుగా వెళ్లిపోతారు. 
 
తర్వాత కెనడాలోని ఆయా విద్యాసంస్థలు కొంత సొమ్ము మినహాయించుకుని విద్యార్థులకు వారు కట్టిన ఫీజును వాపసు చేస్తాయి. ఇలా చేసినందుకు ఆయా ముఠాలు విద్యార్థులు ఒక్కొక్కరి నుంచి రూ.55-60 లక్షలు వసూలు చేస్తున్నాయి. ఇలా ముంబైలో ఒక సంస్థ ప్రతి సంవత్సరం 25 వేల మందిని, మరో సంస్థ 10 వేల మందిని అమెరికా పంపినట్టు ఈడీ వెల్లడించింది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబై, నాగ్‌పూర్‌, గాంధీనగర్‌, వడోదరల్లోని ఎనిమిది ప్రాంతాల్లో ఈ నెల 10, 19 తేదీల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. విదేశీ వర్సిటీల్లో భారతీయ విద్యార్థులకు అడ్మిషన్లు ఇప్పించడానికి ముంబై, నాగపూర్‌ల్లో రెండు సంస్థలు కమీషన్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో వారి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నామని ఈడీ తెలిపింది.