భక్తుల అభిప్రాయాలకు టిటిడి డిజిటల్ కార్పొరేషన్

భక్తుల అభిప్రాయాలకు టిటిడి డిజిటల్ కార్పొరేషన్
టీటీడీలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు వీలుగా డిజిటల్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలలని పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే భక్తుల కోసం ఆహార భద్రత బోర్డు ఏర్పాటు చేయాలని మరో నిర్ణయం తీసుకుంది.  టీటీడీలో భక్తులకు అందించే సౌకర్యాలు, ఆహారం, అలాగే దేవస్థానాన్ని విస్తరించే ప్రయత్నాలు వంటి అంశాలపై బీఆర్ నాయుడు అధ్యక్షతన బోర్డు కొన్ని నిర్ణయాలు ప్రకటించింది. 
దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.  సాధారణ భక్తులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం కలిగించేలా ఏఐ టెక్నాలజీ సాయం తీసుకోవడంపై కసరత్తు చేస్తున్నామని, ఏఐ టెక్నాలజీ అందించే పలు విదేశీ కంపెనీల డెమోలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇవాళ కూడా రెండు కంపెనీల ప్రజంటేషన్ ను పరిశీలించామని, మిగతా కంపెనీల కాన్సెప్టులను కూడా పరిశీలించి మరో రెండు మూడు నెలల్లో సౌలభ్యమైన విధానాన్ని అమలు చేస్తామని బీఆర్ నాయుడు వివరించారు.
 
దీంతో పాటు టీటీడీలో కొత్తగా కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. తిరుమలలో తక్కువ ధరకే భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. తిరుమల అన్నప్రసాదానికి పెరిగిన డిమాండ్ కు తగినట్లు ఉద్యోగులు లేరని, కాబట్టి త్వరలో వారి నియామకాలు చేపడతామని ఈవో వెల్లడించారు. 
 
అలాగే టీటీడీ కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం కమిటీ వేసి మార్గదర్శకాలు రూపొందిస్తామని చెప్పారు. అలాగే స్విమ్స్ ఆస్పత్రికి జాతీయ హోదా కోసం కేంద్రాన్ని కోరతామన్నారు. ప్రతీ రాష్ట్రంలోనూ శ్రీవారి ఆలయం నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరోవైపు టీటీడీలో రెండు కొత్త సంస్థల ఏర్పాటుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇందులో ఒకటి డిజిటల్ కార్పొరేషన్ కాగా, మరొకటి ఆహార భద్రత బోర్డు. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు డిజిటల్ కార్పోరేషన్ పని చేయనుండగా, భక్తులకు తిరుమలలో ఆహారం అందించే విషయంలో ఆహార భద్రత బోర్డు చర్యలు తీసుకోనుంది.
 
తిరుపతిలోని కంచి కామకోటి సంప్రదాయ పాఠశాలకు రెండు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చేందుకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. తిరుమలలో భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో అన్నప్రసాద తయారీ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదని, తగినంత సిబ్బందిని నియమిస్తామని ఈఓ పేర్కొన్నారు. నడక భక్తుల ఆరోగ్య సమస్యలు తగ్గించేందుకు చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.