యూపీఏ అవినీతి కారణంగానే బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు

యూపీఏ అవినీతి కారణంగానే బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు
యూపీఏ ప్రభుత్వ హయాంలోని అవినీతి కారణంగానే బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) పెరిగిపోయాయని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ ఆరోపించారు. ఈ సమస్యను అధిగమించడానికి వాటిని రద్దు చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన ప్రశంసించారు. నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వద్దకు తాను వెళ్లి ‘బ్యాంకుల్లో వసూలు కానీ బాకీల నుంచి బయటపడాలి. అవి వసూలు అవ్వకపోతే మనం రుణాలు ఇవ్వలేం. వ్యవస్థను శుభ్రం చేయాలి’ అని చెప్పగా, సరే అలాగే ముందుకు సాగండి అని ఆయన అనుమతి ఇచ్చారని వెల్లడించారు.

గత యూపీఏ ప్రభుత్వ ఆర్థిక విధానాల కారణంగా పెద్దయెత్తున బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకుపోయాయని ఆయన స్పష్టం చేశారు.‘ఆర్థిక సంక్షోభం తర్వాత గతంలో ప్రారంభించిన అనేక ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడ్డాయి. భారత దేశం ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మించి ఇబ్బందులు ఎదుర్కొంది. యూపీఏ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాల కారణంగా ప్రాజెక్టుల అనుమతిలో తీవ్ర జాప్యం ఏర్పడింది. పర్యావరణ అనుమతులు లభించ లేదు. దాంతో ఆర్థిక వ్యవస్థలో ఎన్‌పీఏలు కూడా పేరుకుపోయాయి’ అని ఆయన వివరించారు. 

ఈ ఆర్థిక సంక్షోభం కారణంగా తన ముందు పాలకులు ఆర్‌బీఐలో రుణాలను మొండి బకాయిలుగా ప్రకటించడంపై మారటోరింయను అనుమతించే విధానాన్ని అమలు చేశారని చెప్పారు. దీని ఫలితంగా బ్యాంకుల్లో మొండి బకాయిలను గుర్తించకుండా ఉంచడంతో అవి పెద్దమొత్తంలో పేరుకుపోయాయని చెప్పారు.

 తాను బాధ్యతలు చేపట్టిన మొదటి ఏడాది 2014లోనే మారటోరియాన్ని రద్దు చేశానని గుర్తు చేశారు. దాంతో చాలా మొండి బకాయిలు కూడా రద్దయ్యాయని తెలిపారు. ఇలాంటి ప్రక్షాళన బ్యాంకింగ్‌ వ్యవస్థకు అవసరమని  రఘురామ్‌ రాజన్‌ స్పష్టం చేశారు. ఈ మొండి బకాయిలను బ్యాలెన్స్‌ షీట్‌ల్లో ప్రతి ఏడాది చూపుకుంటూ పోతే బ్యాంకులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవని, కొత్త రుణాలు ఇవ్వలేవని రఘురామ్‌ రాజన్‌ తెలిపారు.