ఎంఎస్‌పి కి చట్టబద్ధత, రుణమాఫీ, రెట్టింపు పీఎం కిసాన్

ఎంఎస్‌పి కి చట్టబద్ధత, రుణమాఫీ, రెట్టింపు పీఎం కిసాన్
* పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి సిఫారసు

పంటలకు అందిస్తున్న కనీస మద్దతు ధరలకు (ఎంఎస్‌పి) చట్టబద్ధత కల్పించి అమలు చేయాలని వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని అన్నదాతలు, పలు రైతు సంఘాలు చాలా కాలం నుంచి డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. 

ఎంఎస్‌పిలకు చట్టబద్ధత కోరుతూ శంభు, ఖనౌరీ సరిహద్దుల వద్ద రైతులు ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఈ సిఫారసు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, జలంధర్‌ ఎంపీ చరణ్‌జిత్‌ సింగ్‌ చెన్నీ నేతృత్వంలోని కమిటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం, రైతుల సంక్షేమానికి సంబంధించిన గ్రాంట్ల డిమాండ్లపై లోక్‌సభకు తన తొలి నివేదికను అందజేసింది. 

ఎంఎస్‌పిలకు చట్టబద్ధత కల్పించాలన్న సిఫార్సును తన నివేదికలో కమిటీ చేర్చిందని లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ‘దేశంలో వ్యవసాయ సంస్కరణలు, రైతుల సంక్షేమం కేంద్రంగా జరుగుతున్న చర్చలో ఎంఎస్‌పీల అమలు కేంద్ర బిందువుగా ఉన్నదని కమిటీ అభిప్రాయపడింది. ఎంఎస్‌పిలకు చట్టబద్ధత కల్పిస్తే దేశంలో రైతుల ఆత్మహత్యలను తగ్గించవచ్చునని పేర్కొంది. 

రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడం, మార్కెట్‌లో నెలకొంటున్న అస్థిర పరిస్థితుల నుండి వారికి రక్షణ కల్పించడం, రుణ భారాన్ని తగ్గించడం ద్వారా ఆత్మహత్యల నుండి రైతులను కాపాడవచ్చు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎంఎస్‌పిలకు చట్టబద్ధత కల్పించాలని కమిటీ సిఫారసు చేసింది’ అని లోక్‌సభ సచివాలయం ఆ ప్రకటనలో వివరించింది.

వీలైనంత త్వరగా ఎంఎస్పీని చట్టబద్ధంగా అమలు చేయడానికి ఒక మార్గ సూచిని రూపొందించాలని వ్యవసాయ శాఖకు ప్యానెల్‌ గట్టిగా ప్రతిపాదించిందని నివేదిక పేర్కొంది. రైతుల ఇక్కట్లకు, ఆత్మహత్యలకు రుణభారమే కారణమని అభిప్రాయపడిన కమిట అన్నదాతలు, వ్యవసాయ కార్మికుల రుణాలను మాఫీ చేసేందుకు ఓ పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రానికి సూచించింది. 

2021-22, 2024-25 మధ్యకాలంలో వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖకు అధిక కేటాయింపులు జరిపినప్పటికీ కేంద్ర ప్రణాళికా వ్యయంలో ఈ శాఖ వాటా 3.53 శాతం (2020-21) నుండి 2.54 శాతానికి (2024-25) తగ్గిపోయిందని కమిటీ అందజేసిన గణాంకాలు చెబుతున్నాయి.  ఈ నేపథ్యంలో ఉత్పాదకతను మెరుగుపరచడానికి వ్యవసాయానికి బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలని కేంద్రాన్ని కమిటీ కోరింది.

 పిఎం -కిసాన్‌ పథకానికి అందిస్తున్న వార్షిక మద్దతును రూ.6,000 నుండి రూ.12,000కు పెంచాలని కూడా సిఫారసు చేసింది. వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు అందేలా చూడడానికి సాధ్యమైనంత త్వరగా జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, దీనివల్ల వారికి లభించాల్సిన హక్కులు దక్కుతాయని కమిటీ తెలిపింది.