కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ డేటా ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రమైన కేటగిరీలో నమోదైంది. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో ఏక్యూఐ లెవల్స్ 421గా నమోదయ్యాయి. నగరంలోని 37 మానిటరింగ్ స్టేషన్లలోని 26 స్టేషన్లు 400 మార్క్‌ను దాటాయి. జహంగీర్‌పురిలో ఏక్యూఐ లెవల్స్ 466గా నమోదయ్యాయి. ఆనంద్ విహార్‌లో 465, బవానా ప్రాంతంలో 465, రోహిణి ప్రాంతంలో 462, లజ్‌పత్ నగర్‌లో 461, అశోక్ విహార్‌లో 456, పంజాబి భాగ్‌లో 452గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది.
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.
రాజధానిలో కాలుష్యం మరోసారి తీవ్రస్థాయికి చేరడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గాలి నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టింది. మంగళవారం నుంచి ఢిల్లీలో మరోసారి గ్రాఫ్ 4 ఆంక్షలను విధించినట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధించారు.
కాగా ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్తగ్గే వరకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 నిబంధనలు సడలించొద్దని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. నాలుగో దశ గ్రాఫ్‌లో ఆంక్షలు సడలించే ముందు కాలుష్యాన్ని తగ్గించాలని సూచించింది.
వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అమలు చేసిన జీఆర్ఏపీ4 అమలులో నిర్లక్ష్యం చేస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆంక్షలను అమలు చేయడానికి, ముఖ్యంగా ఢిల్లీలోకి ట్రక్కులు ప్రవేశించకుండా నిరోధించడానికి ఎంత మంది అధికారులను నియమించారని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయంలో జీఆర్ఏపీ4 పరిమితులను పాటించలేదనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీలో ఈ సీజన్‌లో అత్యంత శీతల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

More Stories
కశ్మీర్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు.. 9 మంది దుర్మరణం
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన
అల్ ఖైదా గుజరాత్ ఉగ్రవాద కుట్రలో బంగ్లా వలసదారులు!