* ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త ఇండెర్మిట్ గిల్
భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని మోదీ తరచూ చెబుతుంటారు. ఇందులో భాగంగానే ఆయన వికసిత్ భారత్ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్ అధిక ఆదాయ దేశంగా మారడానికి అవసరమైన మార్పులు త్వరితగతిన జరగడంలేదు. అందుకు నిర్మాణాత్మక సంస్కరణలను వేగవంతం చేయాలని భారతదేశ విధాన రూపకర్తలను ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త ఇండెర్మిట్ గిల్ కోరారు.
ప్రపంచంలోనే భారత్ అధిక ఆదాయ దేశంగా మారాలంటే కొన్నింటికి ప్రాధాన్యతనివ్వాలని, వాటిల్లో ప్రధానంగా నూతన సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా ఉత్పాదకతను మెరుగుపరచడం వంటివి చేయాలని గిల్ సూచించారు. ముఖ్యంగా పెద్ద సంస్థల వృద్ధిని ప్రోత్సహించాలి. ఎందుకంటే అవి కొత్త కొత్త ఆవిష్కరణలకు ఇంజన్‌లుగా ఉంటాయని ఆయన సలహానిచ్చారు.
భారత్ వేగంగా అభివృద్ధి చెందాలంటే నిర్మాణాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టడానికి ఆర్థిక సంక్షోభ కాలాలను అవకాశాలుగా ఉపయోగించుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. తాజాగా సిఐఐ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ ఫోరమ్ 2024లో గిల్ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మూడు ప్రధాన నిర్మాణ అసమర్థతలను ఆయన ఎత్తిచూపారు.
మొదటిది : మూలధనాన్ని తక్కువగా ఉపయోగించడం, ఉత్పాదకత లేని సంస్థల కార్యకలాపాల్ని కొనసాగించడం, సమర్థవంతమైన సంస్థలకు వనరుల పున:కేటాయింపు పరిమితం చేయడం, రెండవది : (టాలెంట్ పూల్) ప్రత్యేకించి మహిళల టాలెంట్‌ను తక్కువగా ఉపయోగించడం, మూడవది : శక్తి సామర్థ్యం. భారత్‌లో శక్తిసామర్థ్య నిష్పత్తులు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ప్రపంచవ్యాప్తంగా శక్తిసామర్థ్యాలున్న దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచింది, వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు.
అయితే ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వృద్ధి క్షీణిస్తోందని, గత రెండు దశాబ్దాలుగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లోనూ వృద్ధిరేటు కూడా సగానికి తగ్గిందని గిల్ పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచ బ్యాంకు విధానాలకనుగుణంగానే భారత్ వృద్ధిలో ప్రైవేటు భాగస్వామ్యం మరింత పెంచాలని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.
భారత్ 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరం అని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘నైట్ ఫ్రాంక్ ఇండియా (ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ యాజమాన్యంలోని ప్రాపర్టీ కన్సల్టెన్సీ)’ గురువారం విడుదదల చేసిన తాజా నివేదిక తెలిపింది.
‘భారత్ 2030 నాటికి భారత్ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా వృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాల వృద్ధికి 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి అత్యవసరమని ఈ నివేదిక పేర్కొంది. ఇంత పెట్టుబడి పెడితే 2024-2030 నాటికి సిఎజిఆర్ (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్): సమ్మిళిత వృద్ధి 10.1 శాతం వృద్ధి చెందుతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో నైట్ ఫ్రాంక్ ఇండియా సిఎండి శిశిర్ బైజల్ మాట్లాడుతూ ‘మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులను పెంచింది. దీంతో లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (ఎల్‌పిఐ)లో భారత్ ర్యాకింగ్ కూడా పెరిగింది. 2014లో 54 నుండి 2023లో 38వ ర్యాకింగ్‌కి మెరుగుపడింది. దీనికి ప్రధాన కారణం గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశ మౌలిక సదుపాయాలను గణనీయంగా విస్తరించేందుకు విధాన నిర్ణేతలు దూకుడుగా ముందుకు సాగడమే’ అని ఆయన తెలిపారు.
అలాగే భారత ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల వృద్ధిలో ప్రైవేటు భాగస్వాముల పాత్ర కీలకంగా ఉందని బైజల్ చెప్పారు. అయితే ప్రైవేట్ భాగస్వాముల పాత్ర పరిమితంగానే ఉంది. దేశంలో సమ్మిళిత, దీర్ఘకాలిక స్థిరమైన ఆర్థిక వృద్ధికి ప్రైవేటు పెట్టుబడులు కీలకం. అందుకు తగ్గట్టుగా ప్రైవేటు పెట్టుబడుల కేటాయింపులకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని బైజల్ పేర్కొన్నారు.
మౌలిక సదుపాయల పెట్టుబడులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా ఆధారపడితే ద్రవ్యలోటు లక్ష్యాలను దెబ్బతీయవచ్చునని నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేటు భాగస్వామ్యం తగ్గిందని ఈ నివేదిక ఎత్తిచూపింది. 2009-13 మధ్యకాలంలో 160 బిలియన్ డాలర్లు (మొత్తం పెట్టుబడులలో 46.4 శాతం) నుండి 2019-23 మధ్య 39.2 బిలియన్ (7.2 శాతం) డాలర్లకు తగ్గిందని ఈ నివేదిక తెలిపింది.
ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడానికే 2025 నాటికి స్థూల ఆర్థిక లోటును 4.5 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని ఈ నివేదిక పేర్కొంది. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థ యొక్క దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పడే ప్రజారోగ్య సంరక్షణ, మానవ మూలధనం బలోపేతం చేయడం, రుణ చెల్లింపులు మొదలైన ఇతర ఆర్థిక వృద్ధికి సంబంధించిన ఇతర కీలక విభాగాలకు ప్రభుత్వ వ్యయాన్ని మళ్లించవచ్చునని ఈ నివేదిక తెలిపింది.

More Stories
అసోంలో బహుభార్యత్వం నిషేధం.. దోషులకు ఏడేళ్ల జైలు
జూబ్లీహిల్స్ విషయంలో మీడియా ఎక్కడ దారితప్పుతున్నదంటే.. !
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత