అల్లు అర్జున్ కు హైకోర్టులో మధ్యంతర బెయిల్

అల్లు అర్జున్ కు హైకోర్టులో మధ్యంతర బెయిల్
* అల్లు అర్జున్‌ అరెస్టుపై బండి సంజయ్ ఆగ్రహం
 
 సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో ఏ-11గా ఉన్న అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టులో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. పిటిషన్లపై ఇటు నాంపల్లి కోర్టులో, అటు తెలంగాణ హైకోర్టులో కాసేపు వ్యవధిలో ఒకేసారి వాదనలు జరిగాయి.   అంతకుముందు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దాంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మరోవైపు అల్లు అర్జున్‌పై నమోదైన కేసును కొట్టివేయాలని, సాధ్యంకాని పక్షంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ వేశారు.   క్వాష్‌ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణానికి అల్లు అర్జున్‌ ప్రత్యక్షంగా కారణం కాదని ఆయన తరఫు లాయర్లు  ఆయన ర్యాలీగా వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసుల తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.
 
ఈ కేసులో పోలీసులు పెట్టిన సెక్షన్‌లు అల్లు అర్జున్‌కు వర్తించవని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. నటుడు అయినంత మాత్రాన సామాన్య పౌరులకు వర్తించే మినహాయింపులను అల్లు అర్జున్‌కు నిరాకరించలేమని, ఆయనకు జీవించే హక్కు ఉన్నదని కోర్టు పేర్కొన్నది. అర్నాబ్‌ గోస్వామి కేసులో బాంబే కోర్టు తీర్పును ఆధారంగా తీసుకుని ఈ ఉత్తర్వులు ఇస్తున్నామని న్యాయమూర్తి తెలిపారు.
 
వాదనల సందర్భంగా ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని లాయర్‌ నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. అల్లు అర్జున్ తన ప్రతి సినిమా విడుదల రోజున థియేటర్‌కు వెళ్తారని తెలిపారు. థియేటర్ యాజమాన్యం, నిర్మాత పోలీసులకు సమాచారం ఇచ్చారని, అల్లు అర్జున్ రాత్రి 9.40కి సంధ్య థియేటర్‌కు వెళ్లి మొదటి అంతస్తులో కూర్చున్నారని పేర్కొన్నారు. తొక్కిసలాటలో మరణించిన మహిళ కింద అంతస్తులో ఉన్నారని అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ తగిన భద్రత ఇవ్వలేదని అల్లు అర్జున్ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. భద్రత కోరుతూ సంధ్యా థియేటర్‌ యాజమాన్యం చేసిన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారని, అయినా అల్లు అర్జున్‌ సంధ్యా థియేటర్‌కు వచ్చారని, అలా ర్యాలీగా వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు వాదించారు.

ఇదిలా ఉండగా, జాతీయ అవార్డు గ్రహిత అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన తీరు సరైనది కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. నేరుగా బెడ్‌రూంలోకి వచ్చి అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా అరెస్టు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్‌ భారత సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారని బండి సంజయ్‌ తెలిపారు. అలాంటి వ్యక్తితో కాస్త మర్యాదగా వ్యవహరించాల్సిందని అభిప్రాయపడ్డారు. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం నిజంగా విచారకరమని తెలిపారు. కానీ ఆ తొక్కిసలాట పూర్తిగా కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని ఆరోపించారు. 

పుష్ప ది రైజ్‌ ఘన విజయం తర్వాత పుష్ప 2కి విపరీతమైన క్రేజ్‌ వచ్చిందని, ఆ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయని సంజయ్‌ తెలిపారు. అలాంటి సమయంలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు సరైన ఏర్పాట్లు చేయకపోవడం నిజంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యమే అని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని చెప్పారు. 

ఈ ఘటనలో అల్లు అర్జున్‌ను నేరస్తుడిగా చూడొద్దని, ఆయనకు కనీస గౌరవం ఇవ్వాలని హితవు పలికారు. జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్‌ అరెస్టును అరెస్టును బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. అసలు బెన్‌ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు అని ప్రశ్నించారు.

అల్లు అర్జున్‌ అరెస్టును గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు అల్లు అర్జున్‌ బాధ్యుడు కాదని ఆయన, ప్రభుత్వ వైఫల్యమే కారణమని స్పష్టం చేశారు.