మాధవిలతపై బీదర్ లో నిషేధం

మాధవిలతపై బీదర్ లో నిషేధం
కర్ణాటకలోని బీదర్‌లో హిందూ సంఘాలు నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆ జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించారు. అంతేగాక, తెలంగాణ బీజేపీ నేత మాధవీలతతో పాటు ముగ్గురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా నిషేధం విధించారు. శాంతియుతంగా నిర్వహించుకునే సమావేశాలకు కూడా అనుమతించకపోవడంతో కలెక్టర్‌పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
 
కాగా, బీదర్ జిల్లా కలెక్టర్ గిరీష్ బడోలే ఆదేశాలతో మాధవీలతను సోమవారం వరకు బీదర్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఆదివారం నిర్వహించాల్సిన హిందూ సంఘాల సమావేశానికి అనుమతి నిరాకరించడంతోపాటు పాల్గొనే నేతలపై నిషేధం విధించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

బీదర్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధించబడిన నాయకుల్లో మాధవీలతతోపాటు శ్రీరామ్ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్, హిందుత్వ కార్యకర్త కాజల్ హిందుస్థానీ ఉన్నారు. మతపరమైన ఉద్రిక్త ప్రసంగాలు చేయడంలో వీరంతా అలవాటు నేరస్తులు అని, ఇది జిల్లాలో శాంతిభద్రతల విఘాతానికి దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

డిసెంబర్ 7 మధ్యాహ్నం 12 గంటల నుంచి డిసెంబర్ 9 ఉదయం 6 గంటల వరకు నిషేధాన్ని విధించారు. బీదర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించిన సాయి స్కూల్ గ్రౌండ్‌లో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023లోని సెక్షన్ 163 (ఇంతకుముందు 144 సెక్షన్) విధించామని, ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడటాన్ని నిషేధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
కలెక్టర్ చర్యపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. హిందువుల గొంతకను అణిచివేసే కుట్ర చేస్తున్నారంటూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.