
తనను, తన సోదరి షేక్ రెహానాను కూడా యూనుస్ ప్రభుత్వం హత్య చేసేందుకు పధకం రూపొందించినట్లు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. తన తండ్రి షేక్ ముజ్బీర్ రెహ్మాన్‌ను చంపిన మాదిరిగానే హత్యకు కుట్ర జరిగిందని ఆమె వెల్లడించాయరు. ముజ్బిర్ రెహ్మాన్‌ను 1975లో హత్య చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఆమె బంగ్లాదేశ్ నుండి పారిపోయి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే.
అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మొదటిసారి వర్చువల్‌గా పాల్గొని ప్రసంగిస్తూ యూనుస్ సర్కారు నరమేధానికి పాల్పడుతున్నట్లు ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనస్‌ది అధికార వ్యామోహం అని, బంగ్లాదేశ్‌లోని ప్రార్థనా స్థలాలపై దాడి జరుగుతోందని చెబుతూ ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడంలో తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హసీనా మండిపడ్డారు.
హిందువులు సహా మైనారిటీల రక్షణలో యూనస్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ మైనార్టీలను తీవ్ర ఊచకోస్తున్నట్లు ఆమె ఆరోపించారు. ఊచకోతకు పాల్పడినట్లు తనపై ఆరోపణలు చేస్తున్నారని, కానీ నిజానికి యునుస్ నరమేధం సృష్టిస్తున్నారని, చాలా సూక్ష్మ పద్ధతిలో ఆ ప్రక్రియ జరుగుతోందని హసీనా ఆరోపించారు. విద్యార్థి సంఘాల కోఆర్డినేటర్లు, యునుస్ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లు ఆమె తెలిపారు.
తాను బంగ్లాదేశ్ ప్రధానిగా చివరి రోజు అధికారిక నివాసంలో ఉండగా పెద్ద సంఖ్యలో నిరసనకారులు చుట్టుముట్టారని గుర్తు చేస్తూ తాను ఆదేశిస్తే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపేవారని ఆమె పేర్కొన్నారు. అయితే కాల్పులు జరిగితే చాలా మంది మరణించేవారని, అందుకనే ప్రాణనష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే తాను 25 నుండి 30 నిమిషాల్లో ఢాకా నుండి బయలుదేరి భారత్‌కు వచ్చేశానని హసీనా వెల్లడించారు.
తన రాజకీయ ప్రత్యర్థి ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్ ప్రకటనను కూడా ఆమె ప్రస్తావించారు. ప్రాణనష్టం కొనసాగితే తాత్కాలిక ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని రెహమాన్ గతంలో పేర్కొన్నారు. “ఈరోజు నాపై సామూహిక హత్యల ఆరోపణలు వచ్చాయి. వాస్తవానికి విద్యార్థి కో-ఆర్డినేటర్లతో కలిసి పక్కా ప్రణాళికతో సామూహిక హత్యలకు పాల్పడ్డాడు మహమ్మద్ యూనస్. వారే సూత్రధారులు” అని ఆమె స్పష్టం చేశారు.
కాగా, బంగ్లాదేశ్‌లో త్వరగా ఎన్నికలు నిర్వహించాలిందిగా పలు రాజకీయ పార్టీలు ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్‌ను కోరాయి. ముఖ్య సలహాదారుతో ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించారు. దేశంపై జరుగుతున్న దురాక్రమణను ఏ రీతిన ఎదుర్కోవాలనే అంశంపై యూనస్ రాజకీయ పార్టీల నుండి సలహాలు, సూచనలు కోరారు.
అగర్తలాలో బంగ్లాదేశ్ అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో బంగ్లాదేశ్- భారత్ సంబంధాల తీరుతెన్నులను నిర్ణయించేందుకు అనుసరించే వ్యూహంపై రాజకీయ పార్టీల నుండి సూచనలు కోరేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి అవామీ లీగ్, దాని మిత్రపక్షాలు హాజరు కాలేదు.
ఎన్నికల తేదీని ప్రకటిస్తే ప్రజల్లో ఒక రకమైన ఉత్సాహం తలెత్తుతుందని, ఆ ఉత్సాహం దేశానికి ఉపకరిస్తుందని అందుకే ఈ సమావేశం ప్రధాన ఎజెండా కానప్పటికీ దీనిపై చర్చించామని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) స్థాయి సంఘం సభ్యుడు అమీర్ ఖుస్రూ చౌదరి తెలిపారు.
యూనస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంత విస్తృత స్థాయిలో రాజకీయ సమావేశం జరగడం ఇదే ప్రధమం. ఎన్నికలకు ముందుగా పరిస్థితులు ఒక కొలిక్కి వచ్చేందుకు రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతానని యూనస్ హామీ ఇచ్చారు. అయితే భవిష్యత్ ఎన్నికల్లో అవామీ లీగ్, దాని మిత్రపక్షాలను చేర్చుకుంటారో లేదో స్పష్టత రాలేదు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము