
రాజ్యసభలో కరెన్సీ నోట్లు రాజకీయ కలకలం రేపాయి. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద నోట్ల కట్టను గుర్తించినట్లు ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ శుక్రవారం సభలో ప్రకటించడంతో రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. రాజ్యసభలో నోట్ల ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
‘‘గురువారం రాజ్యసభ వాయిదా పడిన అనంతరం సాధారణ తనిఖీల సందర్భంగా 222వ నెంబర్ సీటు వద్ద భద్రతా అధికారులు రూ.500 కరెన్సీ నోట్ల కట్టను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో అంత నగదు సభలోకి ఎలా వచ్చింది? ఆ మొత్తం ఎవరిదో? తేల్చేందుకు విచారణకు ఆదేశించాం’’నట్లు రాజ్యసభ ఛైర్మన్ ధన్ ఖడ్ తెలిపారు. ఆ సీటు తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీదిగా ఛైర్మన్ తన ప్రకటనలో పేర్కొనడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ విషయం తన దృష్టికి తీసుకురాగానే దర్యాప్తునకు ఆదేశించానని వెల్లడించారు. ఈ ప్రకటన సభలో దుమారానికి దారితీసింది. రూ.500, రూ.100 కరెన్సీ నోట్లు ఉన్న కట్టను గుర్తించినట్లు ధన్ ఖడ్ వెల్లడించారు. ఆ నోట్లు అసలైనవో, నకిలీవో స్పష్టత లేదని పేర్కొంటూ ఈ విషయాన్ని సభకు చెప్పడం తన బాధ్యతని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఛైర్మన్ ప్రకటనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. ఈ ఘటనపై విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన ఆయన, దర్యాప్తు పూర్తికాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖర్గే వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుబట్టారు.
‘పేరు చెబితే తప్పేంటి? ఏ సీటు వద్ద కరెన్సీ నోట్ల కట్ట దొరికిందో, అక్కడ ఎవరు కూర్చుంటారో ఛైర్మన్ చెప్పారు. అందులో సమస్య ఏముంది? ఇలా నోట్ల కట్టలను సభకు తీసుకురావడం సరికాదు. దీనిపై సీరియస్‌గా దర్యాప్తు జరగాలి’ అని పేర్కొన్నారు. మరోవైపు, రాజ్యసభ సమగ్రతకు అవమానం కలిగించారని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
మరోవైపు, ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ సింఘ్వీ స్పందించారు. తాను రాజ్యసభ ఛైర్మన్ ప్రకటన చూసి ఆశ్చర్యపోయానని మీడియాతో వ్యాఖ్యానించారు. భద్రతా సంస్థలలో వైఫల్యం ఉంటే దానిని పూర్తిగా బహిర్గతం చేయాలని కోరారు. ‘ఇలాంటి పరిస్థితిని నేనెన్నడూ చూడలేదు. నిన్న రాజ్యసభకు వచ్చేటప్పుడు నా జేబులో కేవలం ఒక రూ.500 నోటు మాత్రమే ఉంది. నిన్న మధ్యాహ్నం 12.57 గంటలకు సభ లోపలికి వచ్చా. ఒంటి గంటకు సభ వాయిదా పడటం వల్ల క్యాంటీన్‌కు వెళ్లా. మధ్యాహ్నం 1.30 గంటలకు పార్లమెంట్ నుంచి వెళ్లిపోయా’ అని సింఘ్వీ తెలిపారు.
More Stories
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!