
తమిళనాడు మంత్రి వి.సెంథిల్ బాలాజీకి బెయిల్ ఇచ్చినందున తనకు కూడా బెయిల్ ఇవ్వాలన్న పశ్చిమబెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి వాదనను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. పార్థ ఛటర్జీ బెయిల్ పిటిషన్‌పై తీర్పుని కోర్టు రిజర్వ్ చేసింది. ”ఇక్కడ మంత్రుల మధ్య సమానత్వం అంటూ ఏదీ లేదు. తమిళనాడులో మంత్రికి బెయిల్ వచ్చింది. కావున పశ్చిమబెంగాల్‌లో కూడా మంత్రికి బెయిల్ రావాలని లేదు. ఈ దేశంలో ‘మంత్రులందరి’ సంఘం వంటిది ఏదీ లేదు” అని జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఛటర్జీ రెండున్నర సంవత్సరాలుగా జైలులో ఉన్నారని, ఈ కేసులోని ఇతర నిందితులు బెయిల్‌పై బయట ఉన్నారని చటర్జీ తరపున న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న మంత్రి ఛటర్జీ ఒక్కరేనని, మాజీ మంత్రికి సంబంధించిన భవనం నుండి రూ. 28 కోట్లు స్వాధీనం చేసుకున్నారని ధర్మాసనం పేర్కొంది.
స్వాధీనం చేసుకున్న నగదుతో కానీ, సంబంధిత భవనంతో గాని తనకు ఎలాంటి సంబంధం లేదని నిందితుడు ఖండించలేదని తెలిపింది. ఇప్పుడు తాము సమాజానికి ఏ సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నారని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. అవినీతి పరులు ఇలాగే బెయిల్ పొందవచ్చా, రెండున్నరేళ్లు జైలులో ఉంటే బెయిల్ ఇవ్వాలా? అని పేర్కొంటూ విచారణకు సమయం పడుతుందని స్పష్టం చేశారు.
ఉద్యోగం కోసం నగదు స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో పార్థఛటర్జీని 2022 జులైలో అతని నివాసం నుండి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అరెస్ట్ చేసింది.
More Stories
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం
నేపాల్ సుస్థిరత భారత్‌కు ఎంతో కీలకం