
బీజేపీ శాసనసభా పక్షం నేతగా ఎన్నికైన తర్వాత బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్, మహాయుతి నేతలు ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ లతో బుధవారం రాజ్భవన్లో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం 5.30 గంటలకు ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ తమను ఆహ్వానించారని తదుపరి ఫడ్నవిస్ తెలిపారు.
అంతకు ముందు మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం చేశారు. గవర్నర్ను కలిసిన అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. “మేము గవర్నర్ను కలిశాము. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుక కోసం మద్దతు లేఖను అందజేశాము. రేపు సాయంత్రం 5.30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవానికి గవర్నర్ మమ్మల్ని ఆహ్వానించారు…” అని తెలిపారు.
మహాయుతి సీఎంగా ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా మహాకూటమి భాగస్వామ్య పక్షాలు శివసేన, ఎన్సీపీలు గవర్నర్ను అభ్యర్థించాయని, గవర్నర్ అన్ని అభ్యర్థనలను అంగీకరించి రేపు సాయంత్రం 5.30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవానికి అందరినీ ఆహ్వానించారని ఫడ్నవీస్ తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు సాంకేతిక పదవులు మాత్రమేనని, మహారాష్ట్ర కోసం అందరం కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.
దక్షిణ ముంబైలోని విశాలమైన ఆజాద్ మైదాన్లో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జరగనున్న ఈ వేడుకలో శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే, ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. బుధవారం విధాన్ భవన్లో జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో, బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఫడ్నవీస్ (54) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ కేంద్ర పరిశీలకుడు విజయ్ రూపానీ ప్రకటించారు.
ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులుగా శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఆయన వెల్లడించారు. ఇక మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే అంశంపై మహాయుతి కూటమిలోని మూడు పార్టీలు సమావేశమై త్వరలో నిర్ణయం తీసుకుంటాయని ఆయన చెప్పారు.
ఈ సమావేశంలో బిజెపి కేంద్ర పరిశీలకురాలు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో, కేంద్రంలో “డబుల్ ఇంజన్ ప్రభుత్వం” అభివృద్ధిని పెంచుతుందని తెలిపారు. తనపై విశ్వాసం ఉంచినందుకు బిజెపి శాసనసభ్యులకు ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్ 20 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించడానికి ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన “ఏక్ హై తో సేఫ్ హై” మంత్రం కారణమని ఆయన తెలిపారు.
దేశంలో తమ విజయాల పరంపర పునఃప్రారంభమైందని ఆయన చెప్పారు. ఇంతకుముందు హర్యానాలో, ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయాలు సాధించిందని అన్నారు. మహారాష్ట్ర ఓటర్లు బీజేపీకి కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారని, వారందరికీ తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని ఫడ్నవీస్ తెలిపారు. విధాన్ భవన్ సమావేశంలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత చంద్రకాంత్ పాటిల్ శాసనసభా పక్ష నేతగా ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించారు. శాసనసభా పక్ష సమావేశానికి ముందు ఇక్కడ జరిగిన రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరును అత్యున్నత పదవికి ఖరారు చేశారు.
More Stories
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
ఇది ప్రతి భారతీయుడి విజయం