* అక్రమంగా దక్కించుకున్న భూముల విలువ రూ 700 కోట్లు పైనే
కన్నడ రాజకీయాలను కుదిపేస్తున్న ముడా (మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కుంభకోణంలో అక్రమాలు జరిగినట్టు తాము సాక్ష్యాధారాలతో సహా గుర్తించామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం వెల్లడించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతికి 14 సైట్లను ధారాదత్తం చేసే ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, దీంతో పాటు 1,095 సైట్లను బినామీల పేరిట కొందరికి అక్రమంగా కట్టబెట్టారని ఈడీ తెలిపింది.
ఈ మేరకు లోకాయుక్త పోలీసులకు ఇచ్చిన నివేదికలో వివరించింది. ఈడీ నివేదిక ప్రకారం పార్వతికి కట్టబెట్టిన 14 సైట్లలో నిబంధనల ఉల్లంఘన జరిగింది. ఖరీదైన భూములను కాజేయడానికి సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేశారు. అధికార దుర్వినియోగం జరిగింది. అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేశారు. పార్వతికి లబ్ధి చేయడానికే ఇదంతా చేసినట్టు తమ విచారణలో తేలిందని ఈడీ నివేదికలో వెల్లడించింది.
ఈ అక్రమాలన్నీ సీఎం సిద్ధరామయ్య వ్యక్తిగత సహాయకుడు, ముడా మాజీ కమిషనర్ ఎస్‌జీ దినేశ్ కుమార్ అలియాస్ సీటీ కుమార్ కనుసన్నల్లోనే జరిగినట్టు ఈడీ ఆరోపించింది. దీంతో పాటు ముడా పరిధిలోని ఖరీదైన 1,095 సైట్లను బినామీల పేరిట కొందరు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అక్రమంగా దక్కించుకొన్నారని, వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ. 700 కోట్లపైమాటేనని ఈడీ వెల్లడించింది.ఖరీదైన స్థలాలను చవగ్గా దక్కించుకోవడానికి ఎస్‌జీ దినేశ్ కుమార్‌తో పాటు ముడాలో అప్పుడు ఉన్నత పోస్టుల్లో ఉన్నవారికి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నేతలు లగ్జరీ కార్లు, స్తిరాస్థులను బహుమతిగా ఇచ్చినట్టు ఆరోపించింది. అలా కాజేసిన స్థలాలను వీళ్లు ఎక్కువ రేటుకు ఇతరులకు విక్రయించారని తెలిపింది. పార్వతికి కుమారుడు, ఎమ్మెల్యే యతీంద్ర ముడా బోర్డులో సభ్యుడుగానూ వ్యవహరించారని ఈడీ గుర్తు చేసింది.
ఈడీ, ప్రతిపక్ష నేతల ఆరోపణల ప్రకారం మైసూరు శివారులోని కెసరె గ్రామంలో పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. అయితే, అవసరాల దృష్ట్యా ఆ భూమిని సేకరించిన ప్రభుత్వం దానికి బదులుగా నగరం లోపల అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా చెప్పుకొనే విజయనగర్, దట్టగల్లీ, జేపీ నగర్, ఆర్టీ నగర్, హంచయా-సతాగల్లీలో సిద్ధరామయ్య కుటుంబానికి 38,283 చదరపు అడుగుల భూమిని (14 సైట్స్ కలిపి) కేటాయించింది.
50:50 నిష్పత్తిలో (పడావు పడ్డ ఒక ఎకరా తీసుకొంటే, అభివృద్ధి చేసిన అర్ధ ఎకరం ఇవ్వడం) ఈ కేటాయింపు జరిగింది. అయితే, కెసరెలోని భూములతో పోలిస్తే మార్కెట్ ధర అతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సిద్ధరామయ్య కుటుంబానికి ఆ భూములను కేటాయించాలని ఎవరు సిఫారసు చేశారని బీజేపీ నేత ఆర్ అశోక్ నిలదీశారు.
క్యాబినెట్ అనుమతి లేకుండా భూములు కేటాయించే అధికారం ఎవరికి ఉంటుందని, ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇంత పెద్ద కుంభకోణం జరిగిందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ స్కామ్ మూలంగా కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని ముగ్గురు హక్కుల కార్యకర్తలు ప్రదీప్ కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ.. లోకాయుక్త పోలీసులకు, గవర్నర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
తనపై దర్యాప్తు జరిపేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఇచ్చిన అనుమతిని సీఎం సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. అయితే, పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. పిటిషన్‌లో వివరించిన అంశాలపై నిస్సందేహంగా దర్యాప్తు జరిపించడం అవసరమని తెలిపింది.
హైకోర్టు ఆదేశాలను బట్టి సీఎం సిద్ధరామయ్యను విచారించి రిపోర్టును డిసెంబర్ 24లోపు సమర్పించాలని ప్రత్యేక కోర్టు లోకాయుక్త పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు నోటీసులు పంపి విచారించారు. ఈ క్రమంలోనే ఈడీ నివేదికను సమర్పించడం సంచలనంగా మారింది.
More Stories
భారీ సైబర్ దాడితో నిలిచిపోయిన పలు దేశాల విమానాశ్రయాలు
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
హెచ్-1బీ వీసా రుసుం పెంచడంతో టెక్ సంస్థలు అప్రమత్తం