ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లు 10% తగ్గుముఖం

ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లు 10% తగ్గుముఖం
ఆంధ్రప్రదేశ్‌లో నవంబరు నెల జీఎస్టీ వసూళ్లు 10%మేర తగ్గాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు ఏపీ నుంచి సీజీఎస్టీటీ, ఎస్‌జీఎస్టీ, ఐజీఎస్టీ, సెస్‌ కలిపి మొత్తం రూ.30,056 కోట్లు వసూలైంది. ఎస్‌జీఎస్టీ, ఐజీఎస్టీలో ఎస్‌జీస్టీ భాగాన్ని రాష్ట్రాలకు పంచిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు రూ.21,998 కోట్ల వాటా దక్కింది. 
 
క్రితం సంవత్సరంకంటే ఇందులో 5% వృద్ధి నమోదైంది. గతేడాది నవంబరులో రాష్ట్రంలో జీఎస్‌టీ కింద రూ.4,093 కోట్లు వసూలైంది.. ఈ నవంబరులో అది రూ.3,699 కోట్లకు పడిపోయింది.  తెలంగాణలో  జీఎస్టీ వసూళ్లలో నవంబరులో 3% వృద్ధి నమోదైంది. ఎస్‌జీఎస్టీ, ఐజీఎస్టీ ఎస్‌జీఎస్టీ వాటా పంచిన తర్వాత తెలంగాణకు 2024-25లో ఇప్పటివరకు రూ.29,186 కోట్లు వచ్చాయి. 
 
గతేడాది కంటే ఇది 9% అధికం కావడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు రాష్ట్రంలో సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ, ఐజీఎస్టీ, సెస్‌ రూపంలో మొత్తం రూ.41,065 కోట్లు వసూలైంది. ఇది గతేడాది కంటే 4.9% అధికం. గతేడాది ఇదే నెలలో రూ.4,986 కోట్లు వసూలు కాగా, అది రూ.5,141 కోట్లకు పెరిగింది.

దేశంలో మరోసారి జీఎస్టీ వసూళ్లు గణనీయ స్థాయిలో నమోదయ్యాయి. నవంబర్ నెలలో‌ రూ.1.82లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇందులో సీజీఎస్టీ రూపంలో రూ.34,141 కోట్లు, ఎస్‌జీస్టీ రూపంలో రూ.42,047 కోట్లు, ఐజీఎస్టీ రూపంలో రూ.91,828 కోట్లు వచ్చాయి. సెస్‌ల రూపంలో మరో రూ.13,253కోట్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. దేశీయ లావాదేవీలతో అధిక మొత్తంలో రెవెన్యూ వచ్చింది.
 
గతేడాది నవంబర్‌తో (రూ.1.68 లక్షల కోట్లు) పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 8.5శాతం పెరిగింది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏడోసారి జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును దాటింది. ఈ ఏడాది అక్టోబర్‌లో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు 9శాతం వార్షిక వృద్ధితో రెండో అత్యుత్తమ వసూళ్లు కాగా.. అంతేకాదు 2024 ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.2.10 లక్షల కోట్లు వసూళ్లు వచ్చాయి. 
 
మరోవైపు జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశం డిసెంబర్ 21న జైసల్మేర్‌లో జరగనుంది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారని అధికారులు తెలిపారు. నవంబర్‌లో కౌన్సిల్ సమావేశం కావల్సింది. కానీ మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు శీతాకాల సమావేశాల కారణంగా వాయిదా వేశారు.