
మహారాష్ట్రలో మహాయుతి కూటమి కొత్త ప్రభుత్వం డిసెంబర్ 5న ఏర్పాటు అవుతుందని, దేవేంద్ర ఫడ్నవీస్ తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని బిజెపి సీనియర్ నేత ఒకరు శనివారం ప్రకటించారు. డిసెంబర్ 5న సాయంత్రం 5 గంటలకు ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని మహారాష్ట్ర బిజెపి అధ్యక్షులు చంద్రశేఖర్ బవాన్‌కులే ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారని తెలిపారు. అయితే సిఎం ఎవరన్నది మాత్రం ప్రస్తావించక పోవటం గమనార్హం. నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి), ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి 288 అసెంబ్లీ సీట్లకు ఏకంగా 230 సీట్లు గెలుచుకుని అధికారాన్ని నిలబెట్టుకున్నది.
132 సీట్లతో బిజెపి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించగా, శివసేన 57, ఎన్‌సిపి 41 సీట్లు సాధించాయి. అయితే, ఎన్నికల ఫలితాలు ఒక వారం క్రితం (నవంబర్ 23న) ప్రకటించిన పిమ్మట కూడా ప్రభుత్వం ఏర్పాటు ఆలస్యం అయింది. తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిని త్రిపక్ష కూటమి ఇంకా నిర్ణయించకపోవడం అందుకు కారణం.
అయితే కొత్త సిఎంగా బిజెపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతున్నా రేసులో కొత్తగా మురళీధర్ మోహౌల్ పేరు తెరపైకి వచ్చింది. బిజెపి పుణె ఎంపి అయిన మురళీధర్ ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈయన మహారాష్ట్ర సిఎంగా బాధ్యతలు స్వీకరిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా ఆ పోస్టులపై మురళీధర్ స్పందించారు. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు.
తదుపరి ప్రభుత్వానికి సంబంధించి అధికారం పంపిణీ గురించి చర్చించేందుకు షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ గురువారం రాత్రి పొద్దుపోయిన తరువాత బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. శుక్రవారం జరగవలసిన మహాయుతి కీలక సమావేశం వాయిదా పడింది. అది ఆదివారం జరగవచ్చు.
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సతారా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లడంతో ప్రభుత్వం ఏర్పాటు మరింత ఆలస్యం అయింది. కాగా, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం డిసెంబర్ 5న జరుగుతుందని పేరు వెల్లడికి ఇష్టపడని బిజెపి నేత చెప్పారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా, గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన బిజెపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సిఎం పదవికి ప్రధాన అభ్యర్థిగా ఉన్నారని ఆ నేత తెలిపారు.
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం దక్షిణ ముంబయిలోని అజాద్ మైదాన్‌లో జరుగుతుందని మరొక సీనియర్ బిజెపి నేత తెలియజేశారు. దానికి ముందుగా బిజెపి శాసనసభా పక్షం నేతను ఎన్నుకునేందుకు డిసెంబర్ 2న ఒక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
కాగా, తదుపరి సిఎం అభ్యర్థిపై బిజెపి అధిష్ఠానం నిర్ణయాన్ని తాను పూర్తిగా సమర్థిస్తానని, ఆ ప్రక్రియకు తాను అవరోధం కాబోనని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి షిండే స్పష్టం చేశారు. ఇక ముఖ్యమంత్రి పదవికి ఫడ్నవీస్ పేరుకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి మద్దతు ప్రకటించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ఎదురుదెబ్బ తిన్నది. వృద్ధ పార్టీ కాంగ్రెస్ కేవలం 16 సీట్లు గెలుచుకుని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత అధ్వాన ప్రదర్శన నమోదు చేసింది. శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సిపి (ఎస్‌పి) పది సీట్లు మాత్రమే నెగ్గా, ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన (యుబిటి) 20 సీట్లు గెలిచింది.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్