నైరుతి బంగాళాఖాతంలో గురువారం వరకు స్థిరంగా కొనసాగిన తీవ్ర వాయుగుండం శుక్రవారం నాటికి పెను తుఫాన్‌గా మారింది. పది కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్యంగా పయనిస్తోంది. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న భారత వాతావరణ శాఖ తుఫాన్‌గా బలపడిందని ప్రకటించింది. దీనికి ఫెయింజల్‌గా నామకరణం చేశారు.
ఇది మధ్యాహ్నానికి నాగపట్నానికి తూర్పుగా 260 కి.మీ., చెన్నైకు 300 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ స్వల్పంగా దిశ మార్చుకుని పశ్చిమ వాయవ్యంగా పయనించి శనివారం మధ్యాహ్నం మహాబలిపురం, కరైకల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటుతుంది. ఆ సమయంలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది.
తుఫాన్ ఉత్తర తమిళనాడు వైపు దూసుకువస్తున్న నేపథ్యంలో ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకుని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో, శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ఇంకా అన్నమయ్య జిల్లాలో భారీ నుంచి అతిభారీ, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీవర్షాలు, శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు.
కాగా, తుఫాన్ ఉత్తర తమిళనాడు తీరం దిశగా వస్తున్నందున కోస్తాలో తీరం వెంబడి గాలుల ఉధృతి పెరిగింది. శనివారం దక్షిణ కోస్తాలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కి.మీ., ఉత్తర కోస్తాలో 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి.
ఇంకా.. డిసెంబరు ఒకటి, రెండో తేదీల్లో తీరం వెంబడి గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా తీరంలో అలల ఉధృతి పెరిగింది. తుఫాన్ నేపథ్యంలో ఉత్తర తమిళనాడు సమీపంలో ఉన్న కృష్ణపట్నం ఓడరేవులో ఆరో నంబరు ప్రమాద హెచ్చరిక, ఇతర ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఇన్‌ఛార్జి డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాసరావు తెలిపారు. చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని సూచనలు చేశారు.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి