
గత రెండు వారాలుగా బాకూలో జరిగిన వాతావరణ చర్చలు ఆదివారంతో ముగియడంతో తాజాగా ప్లాస్టిక్ భూతాన్ని భూగోళం నుండి తరిమికొట్టడంపై దేశాలు దృష్టి పెట్టాయి. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందించేందుకు గానూ ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వ ఒప్పందానికి పునాదులు వేయడానికి తీర ప్రాంత నగరమైన బుసాన్‌లో నేతలు సమావేశం కానున్నారు.
డిసెంబరు 1న 175 దేశాలకు చెందిన ప్రతినిధులు చర్చలు జరిపి, ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఆశిస్తున్నారు. ఏటా వాతావరణ మార్పులపై జరిగే సమావేశం (కాప్) మాదిరిగానే వీరు కూడా ప్లాస్టిక్‌ను రూపుమాపేందుకు చట్టబద్ధంగా కట్టుబడి వుండేలా ఒక ఒప్పందాన్ని రూపొందించాలని భావిస్తున్నారు. 1992లో తొలిసారిగా వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఒప్పందాన్ని ఆమోదించారు. 1994 నుండి అమల్లోకి వచ్చింది. 1995లో బెర్లిన్‌లో తొలి కాప్ సదస్సు జరిగింది. అయితే 2015లో చారిత్రక పారిస్ ఒప్పందం కుదరడానికి 21సంవత్సరాలు పట్టింది.
కానీ ప్లాస్టిక్‌ను నిర్మూలించే విషయంలో 21ఏళ్ళు వేచి వుండలేమని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యుఎన్‌ఇపి) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంగర్ ఆండర్సన్ స్పష్టం చేశారు. సముద్ర జలాల్లో సహా మొత్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించాలంటూ 2022లో నైరోబిలో యుఎన్‌ఇపి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
ప్లాస్టిక్ కాలుష్యం ఒక సమస్యగా మారిందన్న విషయంలో అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం వుంది. ప్లాస్టిక్‌ను రీ సైక్లింగ్ చేయడంపై, కొన్ని రకాల ప్లాస్టిక్‌ను నిషేధించడంపై అనేక దేశాలు ఆసక్తిగా వున్నాయి. ఇప్పటికే కొన్ని మార్గాలు కూడా చేపట్టారు. ఉదాహరణకు భారతదేశంలో 2022 నుండి ఒకసారి వాడే ప్లాస్టిక్‌ను నిషేధించారు.
More Stories
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము
ఇరాన్‌పై మరోసారి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు
ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్