మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా

మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి  పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా చేశారు. మంగళవారం  ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. షిండే వెంట ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకూ షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.
 
అధికారికంగా ముఖ్యమంత్రి ఎవరనేది ప్రకటించనప్పటికీ మరో నాలుగైదు రోజుల్లో ముఖ్యమంత్రితో సహా కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. డిసెంబర్ 2వ తేదీన అతిపెద్ద ఈవెంట్‌గా ఈ ప్రమాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెబుతున్నారు.
 
బీజేపీ మునుపెన్నడూ లేనంతగా 132 సీట్లు గెలుచుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని లీడ్ చేసే బాధ్యత ఫడ్నవిస్‌కు అప్పగించడం ఉత్తమ ఎంపిక అవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మహాయుతి కూటమిలో మరో కీలక భాగస్వామిగా ఉన్న అజిత్ పవార్ ఎన్‌సీపీ వర్గం ప్రకటించింది.
 
గత రెండున్నరేళ్లపాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన షిండే లాడ్లీ బెహన్ స్కీమ్ తీసుకువచ్చారు. ఈ పథకం ద్వారా 2.5 కోట్ల మంది మహిళలు లబ్ధిపొందారు. తాజాగా జరిగిన మహా ఎన్నికల్లో మహాయుతి గెలుపునకు ఈ పథకం ఎంతో తోడ్పడింది. పథకం విజయవంతం కావడంతో మహిళలు పెద్దఎత్తున కూటమికి ఓటు వేశారు.
 
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీకి 132, శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఇక ప్రస్తుత అసెంబ్లీ గడువు నేటితో ముగియనుంది. ఇంతవరకూ సీఎం అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు ముఖ్యమంత్రి పదవిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు.