ఆసీస్‌తో తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం

ఆసీస్‌తో తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం
బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో జస్ప్రీత్‌ బుమ్రా నేతృత్వంలోని భారత జట్లు ఘన విజయం సాధించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో భారత్‌ గెలిచింది. దాంతో ప్రతిష్ఠాత్మక సిరీస్‌లో ఇండియా టీమ్‌ 1-0 ఆధిక్యాన్ని నమోదు చేసింది.

తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ కేవలం 150 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. దాంతో గెలుపు అసాధ్యమే అనుకున్నారంతా. తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆడిన ఆస్ట్రేలియా కూడా 104 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆడిన భారత్‌.. యశస్వి జైస్వాల్‌ (161 పరుగులు), విరాట్‌ కోహ్లీ (100 పరుగులు), కేఎల్‌ రాహుల్ (77 పరుగులు) అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శనతో 487 పరుగుల భారీ స్కోర్‌ సాధించి మరో మూడు వికెట్లు ఉండగానే డిక్లేర్‌ చేసింది.

ఎంతో ఉత్కంఠగా సాగుతున్న  టెస్టు నాలుగో రోజులో ఆసీస్​ బ్యాటర్లు తేలిపోయారు. దీంతో 295 పరుగుల ఆధిక్యంతో టీమ్ఇండియా టెస్ట్​ను సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 238 పరుగులకు ఆలౌట్‌ అయింది. ట్రావిస్‌ హెడ్‌ 89, మార్ష్‌ 47 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్‌, బుమ్రా చెరో 3 సుందర్‌ 2, నితీశ్‌రెడ్డి ఒక వికెట్‌ తీశారు. ఆదివారం బ్యాటింగ్​తో దంచికొట్టిన టీమ్ఇండియా, సోమవారం బౌలింగ్​లోనూ అదరగొట్టడం ఈ విజయానికి కారణం.

ఇక ఈ విజయంతో టీమ్ఇండియా ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. 1977 డిసెంబర్ 30న మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాను 222 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు, ఆ తర్వాత 2018 డిసెంబర్ 26న మెల్‌బోర్న్‌లో మరో పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ రికార్డుతో మరో పెద్ద విజయాన్ని నమోదు చేసింది. దీంతో 47 ఏళ్ల తర్వాత ఈ ఫీట్ సాధించిన టీమ్​గా చరిత్రకెక్కింది.

భారీ లక్ష్య ఛేదనలో 80 పరుగులు స్కోర్ చేసే లోపే సగం వికెట్లను కోల్పోయిన డీలా పడ్డ ఆసీస్ జట్టును ట్రావిస్ హెడ్ (89) కొంతమేర ఆదుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూకుడుగా ఆడాడు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో అతడ్ని బుమ్రా ఔట్‌ చేశాడు. ఆఫ్‌సైడ్ వేసిన షార్ప్‌ బంతిని అంచనా వేయడంలో విఫలమైన హెడ్‌, పంత్‌ చేతికి చిక్కాడు.

అయితే అప్పటికే క్రీజులో ఉన్న మిచెల్ మార్ష మార్ష్‌ కాస్త వేగం పెంచాలని భావించాడు. నితీశ్‌ రెడ్డి చేతిలో బౌల్డ్‌ కావడం వల్ల అనూహ్యంగా పెవిలియన్ బాట పట్టాడు. ఇక నితీశ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టెస్టు వికెట్‌ కావడం విశేషం. అలా ఒక్కో వికెట్​ పడుతున్న కొద్ది ఆసీస్ ప్లేయర్లలో ఆందోళన నెలకొంది.

టీ బ్రేక్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన నాథన్‌ లైయన్ (0)ను సుందర్ క్లీన్‌బౌల్డ్ చేయగా, అతడు వెనుతిరగాల్సి వచ్చింది. అంతకుముందే మిచెల్ స్టార్క్‌ (12) ఔటయ్యాడు. సుందర్ బౌలింగ్​లో స్టార్క్ ఆడిన ఆ బంతిని షార్ట్‌ లెగ్‌సైడ్‌ ఉన్న ధ్రువ్‌ జురెల్ అద్భుతంగా పట్టాడు. దీంతో 227 పరుగుల వద్ద ఆసీస్‌ తమ 8వ అలాగే 9వ వికెట్‌ను కోల్పోయింది.