
ఉత్తర ప్రదేశ్ సంభల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నది. మసీదు సర్వే సందర్భంగా హింస చెలరేగడంతో నలుగురు యువకులు మరణించడంతోపాటు 30 మంది పోలీసులు గాయపడ్డారు. పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉండటంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సంభల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దీంతోపాటు 12వ తరగతి వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
పట్టణంలో మొగల్ కాలానికి చెందిన జామా మసీద్ ఉన్నచోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుతో న్యాయస్థానం సర్వేకి ఆదేశించింది. దీంతో గత మంగళవారం నుంచి సంభల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం పెద్ద గుంపుగా వచ్చిన కొందరు సర్వేకు వ్యతిరేంగా మసీదు ముందు నినాదాలతో ఆందోళనకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టారు.
న్యాయస్థానం ఉత్తరువుల్ మేరకు మొఘలుల కాలం నాటి షాహి జామా మసీదును సర్వే చేయడానికి ఆదివారం ఉదయం ఏడు గంటలకు అడ్వకేట్ కమీషనర్ రమేష్ రాఘవ్ బృందం రెండోసారి సర్వే చేయడానికి జామా మసీదుకు చేరుకున్నప్పుడు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారిని ఒక వర్గం అడ్డుకుంది. ఆందోళనకారులు పెద్దయెత్తున మసీదు వద్ద గుమిగూడి నినాదాలు చేయడం ప్రారంభించారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించగా, అక్కడ ఉన్న మూక భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు.
దీంతో అల్లరిమూకను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జితో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ సమయంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. అల్లర్లకు సంబంధించి ఇద్దరు మహిళలు సహా పదిమందిని అదుపులోకి తీసుకున్నామని మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ తెలిపారు.
ఈ హింసపై దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు పక్కన పార్క్ చేసిన కొన్ని ద్విచక్రవాహనాలకు కూడా కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారు. ముఖ్యంగా దీపా సరాయ్ ప్రాంతంలో బుల్లెట్లు పేలిన అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు అన్నారు. హింసకు పాల్పడిన వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. హింసకు పాల్పడిన దుండగులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఓ గుంపు సర్వే బృందాన్ని లక్ష్యంగా చేసుకుని రాళ్లు రువ్వడం ప్రారంభించింది. జనాన్ని నియంత్రించేందుకు తొలుత తేలికపాటి బలగాలు ప్రయోగించామని, ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘర్షణలో సర్కిల్ అధికారితో సహా 20 నుంచి 22 మంది పోలీసులు గాయపడినట్లు సమాచారం.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్