
కాంగ్రెస్ కు శనివారం మరోసారి భంగపాటు ఎదురైంది. లోక్‌సభ ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకోవడం ద్వారా తిరిగి జాతీయ స్థాయిలో ఓ ప్రధాన రాజకీయ పార్టీగా ఆధిపత్యం వహిస్తుంది అనుకున్న సమయంలో నెలరోజుక క్రితం హర్యానాలో ఎదురైనా పరాజయం, జమ్మూ కాశ్మీర్‌లో పతనం తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్‌లలోని పోకడలు ఆ పార్టీని నిస్తేజం కావిస్తున్నాయి.
మహారాష్ట్రలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ స్థానాలకు పరిమితం కావలసి రావడం గమనిస్తే రాష్ట్ర రాజకీయాలలో ఆ పార్టీ పతనాన్ని వెల్లడి చేస్తుంది. ఒక జార్ఖండ్‌లో కాంగ్రెస్ ఉన్న కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ జేఎంఎం ఆధిపత్యమే కొనసాగుతుంది.
ప్రత్యేకించి మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కలిసి బిజెపికి, మహాయుతి ఆధిపత్యాన్ని అడ్డుకోగలిగాయి. కేంద్రంలో 400కు పైగా మెజారిటీతో అధికారాన్ని అప్పగిస్తే బిజెపి రాజ్యాంగాన్ని మార్చగలదని, రిజర్వేషన్ నిర్మాణాన్ని పలుచన చేయగలదని కాంగ్రెస్, ఎంవిఎ దూకుడుగా ప్రచారం చేసిన నేపథ్యంలో విశేషమైన ప్రయోజనం పొందగలిగింది.
దానికి తోడు కుల గణన కోసం బలమైన వాదన వినిపించడం, రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి తొలగించాలనే డిమాండ్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిపిన ప్రచారం ప్రయోజనం కలిగించింది. అయితే, అవే నినాదాలు, ఇతివృత్తాలతో మహారాష్ట్రలో కాంగ్రెస్ మళ్లీ ప్రచారానికి దిగి ఈ సారి చతికిలబడింది. లోక్‌సభ ఎన్నికలు బహుశా ప్రజలు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కేలా చేశాయని, అయితే అసెంబ్లీ ఎన్నికలలో సీట్ల సర్దుబాట్లు సరిగా లేకపోవడంతో పాటు బిజెపి, దాని మిత్రపక్షాలు ఎన్నికల వ్యూహాన్ని మార్చుకోవడంతో తమకు పరాభవం తప్పలేదని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు భావిస్తున్నారు.
పైగా, ఎంవిఎ కూటమిలోని నేతలంతా ముఖ్యమంత్రి పదవి కోసం ఉవ్విళ్లూరుతూ కనిపించడం, ఎకనాథ్ షిండే ప్రభుత్వం చేపట్టిన లడ్కీ బెహన్ యోజన వంటి పధకాల భారీ ప్రభావాన్ని గ్రహింపలేక పోయారు.
ముఖ్యంగా 62 అసెంబ్లీ స్థానాలు, 10 లోక్‌సభ నియోజకవర్గాలతో రైతుల ప్రభావం ఎక్కువగా ఉన్న విదర్భ ప్రాంతంపైననే కాంగ్రెస్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్ ఐదు సీట్లు, దాని మిత్రపక్షాలు ఎన్సీపీ, శివసేన (యూబీటీ) ఒక్కో సీట్లు గెలుచుకున్నాయి. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ సాంప్రదాయకంగా బలంగా ఉంది.
అయితే గత రెండు దశాబ్దాలుగా బిజెపి పెద్దగా ప్రవేశించింది. 2014లో విదర్భలో మొత్తం 62 స్థానాలకు గాను 44 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. 2019లో, దాని సంఖ్య 29 సీట్లకు పడిపోయింది. ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తితో ఉన్న రైతులను చేరుకొనేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ గమనించినట్లు లేదు. అందుకనే వారి అంచనాలు తలకిందులయ్యాయి.
లోక్‌సభ ఎన్నికలలో బిజెపి సంఖ్యను 303 నుండి 240కి తగ్గించడం ద్వారా దాని నైతిక స్థైర్యాన్ని, ప్రాధాన్యతను దెబ్బతీయడం ద్వారా కొత్త ఉత్సాహం పొందిన తర్వాత జాతీయంగా, కాంగ్రెస్ మళ్లీ కష్టాల్లో పడింది. మరోవైపు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే తన అదృష్టాన్ని తనవైపు తిప్పుకోవాలనే పట్టుదలతో హర్యానాలో మాదిరిగానే ప్రభుత్వ వ్యతిరేకతను అనూహ్యంగా మార్చుకో గలిగింది.
కాంగ్రెస్‌కు, హర్యానా పరాజయం తర్వాత, ఇండియా కూటమికి అధిపతిగా కొనసాగించడానికి, రాజకీయంగా వనరులు సమకూర్చుకునేందుకు జోడించడానికి మహారాష్ట్రలో విజయం తప్పనిసరి. అయితే ఈ పరాజయం ఆ పార్టీ లో నెలకొన్న నాయకత్వ సంక్షోభాన్ని మరోసారి తేటతెల్లం చేసింది. ప్రజలతో సంబంధం లేని నాయకులు పార్టీలో పెత్తనం చేస్తూ ఉండటమే ఓ ప్రధాన కారణంగా ఆ పార్టీ వర్గాలే భావిస్తున్నాయి.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు