
హోంమంత్రి లేని తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు రోజు రోజుకీ పెరిగి పోతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ వరంగల్ లో మహిళాశక్తి అంటూ ప్రభుత్వ మొదటి సంవత్సర సంబరాలు జరుపుకోవడంపై ఆమె విమర్శలు గుప్పించారు.
మహిళల రక్షణ కోసం సమీక్ష చేసేందుకు హోంమంత్రి కూడా దిక్కులేని పరిస్థితి దాపురించిందని పేర్కొంటూ హోంమంత్రి లేని రాష్ట్రంలో తెలంగాణలో మహిళలకు రక్షణ ఎట్ల ఉంటదని ఆమె ప్రశ్నించారు. అలాంటి పరిస్థితుల్లో మహిళా విజయోత్సవాలు చేసుకునే అర్హత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్కడిదని రాణి రుద్రమ నిలదీశారు.
కాంగ్రెస్ మహిళల పేరుతో పెట్టిన సభ కాదని, మహిళలను వంచించి పెట్టిన సభ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అలాంటి పరిస్థితుల్లో మహిళా విజయోత్సవాలు చేసుకునే అర్హత రేవంత్ రెడ్డికి ఎక్కడిదని ప్రశ్నించారు. అడ్డమైన తిట్లు తిట్టినంత మాత్రాన పరిపాలన చేసినట్లు కాదని, రేవంత్ రెడ్డి ఇకనైనా పాలనపై దృష్టి పెట్టాలని ఆమె హితవు చెప్పారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వంటి నాయకులు డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చిన్రు. మహిళా డిక్లరేషన్ చేసిన్రు.
మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చిన్రు.. ఇప్పటికీ కూడా ఎందుకు ఇవ్వలేదని రాణి రుద్రమ ప్రశ్నించారు. డిగ్రీ చదువుకునే ఆడబిడ్డలందరికీ స్కూటీ ఇస్తమన్నరు. ఈరోజు వరకు ఎందుకివ్వలేదని ఆమె నిలదీశారు.
పెండ్లి చేసుకునే ఆడబిడ్డలకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తమన్నరు. ఇప్పటివరకు ఎందుకివ్వలేదు? 50 ఏళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మహిళల సంక్షేమం పట్ల సోయి లేకుండా పాలించడం సిగ్గుచేటని పేర్కొంటూ మహిళల గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని రాణి రుద్రమ దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోవడానికి పనిచేయాలన ఆమె సూచించారు.
బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పట్ల ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం పరిపాలన దక్షత అనిపించుకోదన్న సంగతి గుర్తుంచుకోవాలని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బీజేపీని విమర్శించడం బంద్ చేసి, మందిని తొక్కుడు బంద్ చేసి, మహిళలను ముంచుతూ, మోసం చేయడం ఆపి పరిపాలన మీద శ్రద్ధ పెట్టాలని ఆమె హితవు చెప్పారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి