కాజీపేటకు త్వరలో రైల్వే డివిజన్ హోదా

కాజీపేటకు త్వరలో రైల్వే డివిజన్ హోదా
ఓరుగల్లు రైల్వేకు మరో వరం దక్కనుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డివిజన్ హోదా కాజీపేటకు రాబోతోంది. రాష్ట్రంలో కొత్త రైల్వే డివిజన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాజీపేట లో రైల్వే డివిజన్ కోసం డిపిఆర్ సిద్ధం చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది. 
 
ఒకవైపు ఓవర్ హల్టింగ్ యూనిట్, కోచ్ ఫ్యాక్టరీ అప్‌గ్రేడ్‌తో పాటు మూడో లైన్ పనులు సాగుతున్న దశలో డివిజన్‌కు మోక్షం రావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. డివిజన్ ఏర్పాటు వల్ల కొత్త రైళ్లు ప్రారంభం కావడమే కాకుండా రైల్వే వర్క్‌షాపులు రానున్నా యి. ఉత్తర, దక్షిణ భారతదేశానికి గేట్‌వేగా ఉన్న కాజీపేటను డివిజన్‌గా తీర్చిదిద్దాలని ఎన్నో ఏళ్లుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. 
 
విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ ప్రతిపాదించడంతో ఇక్కడి అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. అయితే పదేళ్లుగా మళ్లీ పోరాటం చేయాల్సి వచ్చింది. ఇక్కడి పరిస్థితులు అనుకూలంగా లేవనే సాకుతో కేంద్రం కేవలం ఓవర్ హాల్టింగ్ యూనిట్‌కు అనుమతి ఇచ్చింది. అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం కోరినా కోచ్‌కు కేంద్రం ‘నో’ చెప్పింది. 
 
ప్రస్తుతం కాజీపేటలో ఓవర్ హాల్టింగ్ యూనిట్ పనులు కొనసాగుతున్నాయి. కొద్దికాలం క్రితం దానిని కోచ్ ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్ చేశారు. మేకిన్ ఇండియాలో భాగంగా దేశీయంగా తయారవుతున్న వందే భారత్ కోచ్ పనులకు కాజీపేటను ఎంచుకున్నారు. ప్రస్తుతం పనులు కొనసాగుతుండగా ఈ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధుల చుట్టూ రైల్వే సంఘాల ప్రతినిధులు తిరుగుతూ డివిజన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.