తప్పనిసరిగా ఓటు వేసేలా చట్టం చేయాలి

తప్పనిసరిగా ఓటు వేసేలా చట్టం చేయాలి
 
దేశంలోని ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకునేలా చట్టం తీసుకురావాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే  సూచించారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మందకొడిగా కొనసాగుతుండటంపై ఆయన స్పందించారు. ఉదయం 11 గంటల వరకు కేవలం 18 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదు కావడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.

ఎన్నికల ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగుతున్నాయని, కానీ ఓటింగ్‌ శాతం మందకొడిగా సాగుతుండటం ఏం బాగలేదని రాందాస్‌ అథవాలే వ్యాఖ్యానించారు. ఓటింగ్‌ శాతం మరింత పెరగాలని, ఓటు హక్కు ఉన్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. 

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓ చట్టం రూపొందించాలని అభిప్రాయపడ్డారు. ‘ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?’ అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. విజయం తమదేనని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని మొత్తం 288 సీట్లకుగాను 165 నుంచి 170 స్థానాలు అధికార మహాయుతి కూటమి గెలుస్తుందని చెప్పారు. స్పష్టమైన మెజారిటీతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భరోసా వ్యక్తం చేశారు.