అమ్మకానికి ఢిల్లీలో హిమాచల్ భవన్

అమ్మకానికి ఢిల్లీలో హిమాచల్ భవన్
గ్యారెంటీల పేరుతో గద్దెనెక్కి రాష్ర్టాన్ని దివాలా తీయించిన హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సర్కారుకు మరో భంగపాటు ఎదురైంది. ఓ విద్యుత్తు సంస్థకు చెల్లించాల్సిన రూ.150 కోట్లను రికవరీ చేసేందుకు ఢిల్లీలోని హిమాచల్‌ భవన్‌ జప్తుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ భవనాన్ని వేలం వేసి బకాయిలు తీర్చేసుకోవాలని సదరు కంపెనీకి సూచించింది. ఈ తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్‌ సర్కారు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

పది గ్యారెంటీల పేరుతో రెండేండ్ల క్రితం హిమాచల్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. రాష్ర్టాన్ని దివాలా తీయించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడం, ఉద్యోగులకు వేళకు జీతాలు ఇవ్వకపోవడం, ప్రజలపై టాయిలెట్‌ ట్యాక్స్‌ విధింపు వంటి నిర్ణయాలు తీసుకోవడంతో సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు సర్కారుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 

ఇప్పుడు హిమాచల్‌ భవన్‌ జప్తు కావడం దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ సర్కారును అప్రతిష్ఠపాలు చేసింది. చీనాబ్‌ నదిపై 340 మెగావాట్ల సెలీ హైడ్రోపవర్‌ ప్రాజెక్టును 2009లో సెలీ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీకి హిమాచల్‌ ప్రభుత్వం అప్పగించింది. ఇందుకు గానూ రూ.64 కోట్లను ఈ సంస్థ ప్రభుత్వానికి ముందస్తు ప్రీమియంగా చెల్లించింది. 

ఆ తర్వాత ఈ ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేసినా, ప్రీమియం డబ్బును మాత్రం సంస్థకు చెల్లించలేదు. దీనిపై ఈ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా వడ్డీతో సహా డబ్బు చెల్లించాలని 2023 జనవరి 13న ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో వడ్డీతో కలిపి చెల్లించాల్సిన బకాయి రూ.150 కోట్లకు చేరింది. కోర్టు ఆదేశించినా హిమాచల్‌ సర్కారు డబ్బులు కట్టలేదు. దీంతో మరోసారి ఈ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా ఢిల్లీలోని మండి హౌజ్‌ ప్రాంతంలో ఉన్న హిమాచల్‌ భవన్‌ను అటాచ్‌ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భవనాన్ని వేలం వేసి, బకాయిలు తీసుకోవాలని సదరు సంస్థకు సూచించింది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్‌ సర్కారుపై బీజేపీ మండిపడింది. హిమాచల్‌ భవన్‌ లాంటి ప్రధానమైన ఆస్తిని జప్తు చేయడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి అని ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్‌ విమర్శించారు. రెండేండ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థతతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తున్నదని ఆయన దుయ్యబట్టారు.