
దేశంలో ఉన్న బీమా కంపెనీల్లో ప్రస్తుతం ఎఫ్‌డీఐకున్న పరిమితి 74 శాతమే. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ యాజమాన్యంలో విదేశీయుల వాటా ఏ రకంగానూ 74 శాతాన్ని మించరాదు. 26 శాతం తప్పకుండా భారతీయుల వాటా ఉండాల్సిందే. అయితే కొత్త బిల్లులో ఈ పరిమితిని పూర్తిగా ఎత్తివేయనున్నట్టు తెలుస్తున్నది.
దీంతో విదేశీ కంపెనీలు భారత్‌లో ఇక్కడి కంపెనీల భాగస్వామ్యం లేకుండానే సొంతంగా బీమా సంస్థలను పెట్టుకోవచ్చన్నమాట. ఇన్సూరెన్స్ మార్కెట్‌లో ఇక స్వతంత్రంగా వ్యాపార కార్యకలాపాలు చేసుకోవచ్చు. తమ ఈ నిర్ణయం వల్ల భారతీయ బీమా రంగం బలోపేతమవుతుందని, విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయని, మార్కెట్‌లో పోటీ కూడా పెరిగి చౌక ధరలకే బీమా అందరికీ అందుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
అయితే స్థానిక సంస్థలకున్న అవకాశాలను ఇది దెబ్బతీస్తుందన్న ఆందోళనలు అటు మార్కెట్ వర్గాల నుంచి, ఇటు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. బీమా చట్టం సవరణతో కేంద్ర ప్రభుత్వం తేవాలని చూస్తున్న మార్పులు ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) విస్తరణకూ అవకాశాలు కల్పించేలా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
కొత్త చట్టం అమలుతో ఆరోగ్య బీమా కంపెనీ దిశగా ఎల్‌ఐసీ అడుగులు పడుతాయని అంటున్నారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఇది సాధ్యం పడడం లేదు. ఇదిలా ఉంటే బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ కూడా లైసెన్సులకు సంబంధించి కొన్ని మార్పులను చేయాల్సి వస్తుందని అంటున్నారు.
ఇప్పుడున్న బీమా చట్టాన్ని సవరిస్తూ తెస్తున్న కొత్త చట్టంలో ఇన్సూరెన్స్ ఏజెంట్లపైనున్న ఆంక్షల్నీ తొలగించాలని కేంద్రం భావిస్తున్నది. ఏజెంట్లు రకరకాల సంస్థలకు చెందిన పాలసీలను స్వేచ్ఛగా అమ్ముకునే సదుపాయాన్ని తేవాలనుకుంటున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక ఏజెంట్ ఒకే సంస్థకు పని చేయాల్సి ఉన్నది.
అయినప్పటికీ తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద అనేక కంపెనీలకు ఒక్కరే ఏజెంట్లుగా పనిచేస్తున్నది గమనిస్తూనే ఉన్నాం. కానీ కొత్త చట్టంతో ఇదంతా చట్టబద్ధం కానున్నది. జీవిత, జనరల్ ఇన్సూరెన్స్ రంగాల్లో ఏజెంట్లు ఎన్ని సంస్థల పాలసీలనైనా అమ్ముకోవచ్చు. దీనివల్ల దేశంలో బీమా పాలసీదారులు మరింత పెరుగుతారని కేంద్రం అభిప్రాయపడుతున్నది.
కాగా, ప్రస్తుతం దేశంలో 24 జీవిత బీమా సంస్థలున్నాయి. మరో 26 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలున్నాయి. అలాగే 6 ఆరోగ్య బీమా సంస్థలున్నాయి. వీటన్నిటికీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీ) రీఇన్సూరర్‌గా వ్యవహరిస్తున్నది.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!