
గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో నైతిక విలువలు వదిలేశారని, రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా బిఆర్‌ఎస్ బాటలోనే నడుస్తోందని విమర్శించారు.
కెసిఆర్ హయాంలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారన్న కిషన్‌రెడ్డి ఏకంగా ఇప్పుడు అప్పుల కోసం టాస్క్‌ఫోర్స్‌నే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై బొంగులూర్ గేట్ ఉన్న వేద కన్వెన్షన్‌లో సోమవారం బిజెపి నిర్వహించిన వర్క్ షాప్ కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి భ్రష్టు పట్టించిందని విమర్శించారు. తాను గుజరాతీలకు గులామ్‌నంటూ సిఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలకు వర్క్‌షాప్ వేదికగా కిషన్‌రెడ్డి గట్టిగా బదులిచ్చారు. తాను భారతీయులకు మాత్రమే గులామ్‌నని సర్దార్ వల్లభాయ్ పటేల్ , మహాత్మా గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన గుజరాత్‌కు తాను గులామ్‌నేనని స్పష్టం చేశారు.
ఇటలీకీ, నకిలీ గాంధీ కుటుంబానికి తాను గులామ్ కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 35 లక్షల బిజెపి సభ్యత్వం నమోదు పూర్తి అయిందని చెబుతూ ఈ నెల చివరి వరకు పోలింగ్ బూత్ కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోలింగ్ బూత్ కమిటీలు వేయాలని చెప్పారు.
ఈ నెల 22 న ఢిల్లీలో జరిగే సమావేశంలో మండల, జిల్లా ఎన్నికల తేదీలు ఖరారు అవుతాయని తెలిపారు. వచ్చే నాలుగేళ్లు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో ఉంటూ పోరాడాలని పిలుపిచ్చారు. రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాల చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలని పేర్కొంటూ ఇప్పటి వరకు రైతుల రుణమాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. వంద రోజుల్లో అమలు చేస్తానన్న హామీలు 340 రోజులు అవుతున్న చేయలేదని అంటూ ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలియదా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. పెన్షన్ ఒక రూపాయి పెంచలేదు, ఒక్కరికి కొత్తగా పెన్షన్ ఇవ్వలేదని తెలిపారు.
తెలంగాణ సమాజాన్ని తాకట్టు పెట్టి అప్పుడు బీఆర్‌ఎస్ అప్పు చేసిందని, నేనేమన్నా తక్కువ తిన్నానా అని అప్పుల కోసమే ఒక టాస్క్ ఫోర్స్‌ని రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
More Stories
రెండు గంటల్లో హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం!
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు