మెట్రో రెండో దశకు కాంట్రాక్టర్లు, బ్యాంకులు రావడం లేదు

మెట్రో రెండో దశకు కాంట్రాక్టర్లు, బ్యాంకులు రావడం లేదు
ఆసియాలోనే అతి రెండో పెద్ద పీపీపీ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ పట్టాలెక్కడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మొదటిదశ నష్టాల్లో నడుస్తున్నందున రెండో దశలో భాగస్వామ్యానికి ప్రైవేటు కంపెనీలు ముందుకురావడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హడావుడిగా శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇక ముందుకు కదలడం కూడా అసాధ్యమని తెలుస్తున్నది.

మెట్రో రైలు రెండో దశ నిర్మాణం చాలా సవాళ్లతో కూడుకున్నదని చెబుతూ రెండో దశ నిర్మాణం చేపట్టేందుకు ప్రైవేటు సంస్థలేవి ముందుకు రావడం లేదని,  అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ఆసక్తి చూపడం లేదని హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్‌విఎస్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. సోమవారం ఎజి కార్యాలయంలో ఆడిట్ వారోత్సవాలను ప్రారంభిస్తూ మెట్రో రైలు రెండో దశ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నిర్మించాలని, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహణ ఉండాలని ఆయన సూచించారు. 

ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించామని చెబుతూ రెండో దశలో దాదాపు 76 కిలో మీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. మెట్రో రైలు మొదటి దశ నిర్మాణంలో ఎల్ అండ్ టీ సంస్థకు భారీ నష్టం వాటిల్లిందని, ఈ అనుభవంతో ప్రైవేటు సంస్థలు ముందుకు రావడానికి భయపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. 

మొదటి దశ మెట్రో వల్ల ఎల్ అండ్ టీకి రూ.6 వేల కోట్ల నష్టం వచ్చిందని, ఏడాదికి రూ.1300 కోట్ల నష్టాన్ని ఎల్ అండ్ టీ సంస్థ భరిస్తోందని తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలే మెట్రోను నిర్వహిస్తున్నాయని ఆయన చెప్పారు. మెట్రోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించాలని సీఎంకు సూచించినట్లు చెప్పారు. 

రెండో దశ మెట్రో నిర్మాణానికి రూ.24,269 కోట్లు అవసరం అవుతున్నాయని, ఇందులో 48 శాతం నిధులు జైకా ద్వారా సమకూరుతున్నాయని వెల్లడించారు. మంత్రివర్గ ఆమోదం తర్వాతే కేంద్రానికి సిఫారసులు పంపామని, కేంద్రం నుంచి అనుమతులు రాగానే రెండో దశ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఇక ప్రజల సహకారం ఉంటే రెండో దశను శరవేగంగా పూర్తి చేస్తామని ఎన్‌విఎస్ రెడ్డి చెప్పారు.

భాగమైన ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా 5.5 కిలోమీటర్ల మేర చేపట్టాల్సి ఉంది. ఆ రూట్‌ను మరో 2 కిలో మీటర్ల పొడవు పెంచి చాంద్రాయణగుట్ట వరకు రైలు నడుపుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కానీ ఇది అయ్యే పని కాదని మా వల్ల కాదు మొర్రో అంటూ ఎల్‌అండ్‌టీ చేతులెత్తేసింది. ప్రభుత్వం ముందుకొస్తే పనులు చేస్తామని స్పష్టంచేసింది.